Begin typing your search above and press return to search.

క్లియర్..టీడీపీ ఆశ..ఆ ఒక్కదాని మీదే!

By:  Tupaki Desk   |   22 April 2019 5:04 AM GMT
క్లియర్..టీడీపీ ఆశ..ఆ ఒక్కదాని మీదే!
X
ఐదేళ్ల పాలన అనంతరం.. తమను గెలిపించే అంశం గురించి మాట్లాడమంటే.. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఒకే ఒక విషయాన్ని చెబుతూ ఉన్నారు. అదే 'పసుపు – కుంకుమ' . తమ విజయావకాశాలను అదే ప్రభావితం చేస్తుందని వారు అంటున్నారు. రెండో రీజన్ గా వృద్ధాప్య పెన్షన్ మొత్తం పెంపు అంశాన్ని చెబుతున్నారు.

ఈ రెండు కార్యక్రమాలు కూడా ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో ఉన్నాయనంగా మొదలైనవే. వృద్ధాప్య పెన్షన్ మొత్తాలను తమకు అధికారం దక్కితే రెండు వేల రూపాయల మొత్తానికి పెంచుతామంటూ జగన్ మోహన్ రెడ్డి చాన్నాళ్లుగానే చెబుతూ వచ్చారు. ఆ హామీని ఎన్నికల ముందు అమలు చేసేసినట్టుగా అనిపించారు చంద్రబాబు నాయుడు. వృద్ధుల పెన్షన్ మొత్తాలను రెండు వేల రూపాయలకు పెంచారు.

ఇక డ్వాక్రా మహిళలకు పసుపు- కుంకుమ అంటూ బాబు తలా పది వేల రూపాయల మొత్తాన్ని చేతిలో పెట్టారు. మూడు విడతల్లో మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి ఆ డబ్బును ప్రభుత్వ ఖజానా నుంచి వేయించారు.

ఇప్పుడు అదే తమను కాపాడుతుందనేది తెలుగుదేశం పార్టీ లెక్కగా తెలుస్తోంది. వాస్తవానికి 'పసుపు- కుంకుమ' అనే ఈ డబ్బుల వ్యవహారం వెనుక వేరే కథ ఉంది. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలు - వడ్డీలేని రుణాల పథకం ఒకటి ఉంది. అది గతం నుంచి ఉంది.

ఆ పథకాల ప్రకారం.. ముందుగా రూపాయి వడ్డీతో డబ్బులను డ్వాక్రా మహిళల నుంచి రుణాలను వసూలు చేస్తారు. మొత్తం పూర్తయ్యాకా వారికి వడ్డీ మొత్తాలను తిరిగి చెల్లిస్తారు. ఆ డబ్బునే చంద్రబాబు నాయుడు 'పసుపు-కుంకుమ' పేరు పెట్టి పోలింగ్ కు ముందు వారి చేతికి అందేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఈ వ్యూహం అయితే స్పష్టం అవుతోంది. అయితే తెలుగుదేశం ఆశలు మాత్రం ఆ పథకం మీదే ఉన్నాయి. మహిళలు అంతా తమకే ఓటేశారని, అందుకే వారికి ధన్యవాదాలు అని కూడా తెలుగుదేశం వాళ్లు పదే పదే ప్రకటించేస్తూ ఉన్నారు. మరి అసలు కథ ఏమిటో.. ఫలితాలు వస్తే కానీ తెలియదు!