Begin typing your search above and press return to search.

దోమలెంత డేంజరో చెప్పేందుకు ఏం చేశారంటే..

By:  Tupaki Desk   |   24 Sep 2016 12:57 PM GMT
దోమలెంత డేంజరో చెప్పేందుకు ఏం చేశారంటే..
X
కొన్ని విషయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భలే నిర్ణయాలు తీసుకుంటుంటారు. అది కూడా ఎంత వేగంగా అంటే.. విన్నంతనే విస్మయం చెందేంత. తాజాగా అలాంటి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ మధ్యన అనంతపురం జిల్లాలో దోమల కారణంగా డెంగ్యూ వ్యాపించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం చంద్రబాబు మీద పెద్ద ప్రభావాన్నే చూపించినట్లుంది. అంతే.. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. దోమల మీద యుద్ధం చేయాలన్న ఆలోచన వచ్చేసింది. వెంటనే కార్యాచరణ చేపట్టాలని అధికారులకు పురమాయించటమే కాదు.. చివరకు ఒక కార్యక్రమాన్ని డిసైడ్ చేసేశారు.

పిల్లలకు పరీక్షలు జరుగుతున్న వేళ.. ఒక రోజు ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేయించి మరీ.. ఏపీ వ్యాప్తంగా విద్యార్థులు.. టీచర్లు కలిసి దోమలపై ప్రచార యుద్ధంచేయాలని డిసైడ్ చేశారు. ఇందుకోసం స్కూల్ కు ప్రత్యేక సెలవు ఇవ్వటమే కాదు.. ఆ రోజు దోమల మీద పిల్లల్లో అవగాహన తెచ్చేలా చేయటం.. ర్యాలీలు నిర్వహించటం.. ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించాలని చెప్పారు.

అనుకున్నట్లే.. ఈ రోజు (శనివారం) స్కూళ్లకు సెలవు ఇచ్చేసి మరీ ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించేలా చేశారు చంద్రబాబు. స్వయాన ముఖ్యమంత్రి దోమల మీద సమరం అంటూ కొత్త కాన్సెప్ట్ ను తెర మీదకు తీసుకురావటంతో స్కూలు పిల్లలంతా యుద్ధ సైనికుల మాదిరి మారిపోయారు. వారిని దోమలపై యుద్ధం చేసేందుకు అవసరమైన అవగాహన బాధ్యతను టీచర్లు తీసుకున్నారు. కాసింత సినిమాటిక్ గా ఉన్న ఈ కార్యక్రమంతోనే దోమల సంహారం పూర్తి అవుతుందా? అన్నది ప్రశ్న. ఒకరోజు అవగాహన.. భారీ ర్యాలీలు.. ప్రచారంతోనే దోమల సంహారం అయిపోతుందా అన్నది ఒక ప్రశ్న. ఏమైనా.. ఇలాంటి యుద్ధాలు ప్రకటించటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతుంది.