మోడీతో చంద్రబాబు టచ్లోనే ఉన్నారా?

Tue Apr 23 2019 11:20:06 GMT+0530 (IST)

మొన్నటి వరకూ మోడీ కక్ష సాధింపు చర్యలు చేపట్టారు.. అంటూ తెలుగుదేశం అధినేత నుంచి ఆ పార్టీ వాళ్లంతా వాదించారు. నాలుగున్నరేళ్ల పాటు బీజేపీతో సాన్నిహిత్యాన్ని కొనసాగించి..చివరి ఆరు నెలలూ మాత్రం చంద్రబాబు  నాయుడు మోడీకి దూరం అయ్యారు. మోడీ మోసం చేశారంటూ విరుచుకుపడ్డారు. అయితే బీజేపీతో సాన్నిహిత్యంగా ఉన్నంత సేపూ చంద్రబాబు నాయుడు మోడీ మీద ఎలా మాట్లాడారో అందరికీ తెలిసిందే.మోడీ మళ్లీ ప్రధాని కావాలని - మోడీకి మించిన మొనగాడు లేడని చంద్రబాబు నాయుడు అప్పట్లో ప్రకటించుకున్నారు. అయితే ఎన్నికల్లో మాత్రం బీజేపీని బూచిగా చూపి చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేశారనేది స్పష్టం అవుతోంది.

చంద్రబాబు తన అవసరానికి తగ్గట్టుగా ఎలా అయినా మాట్లాడగలరు. ఎవరితో అయినా స్నేహం చేయగలరు - ఎవరితో అయినా తనకు శత్రుత్వం ఉందని ప్రకటించుకోగలరు. అదీ చంద్రబాబు నాయుడు కు బాగా అలవాటు అయిన రాజకీయం.

ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు- మోడీలు సన్నిహితులు అవుతారా? అంటే.. అయినా అందులో పెద్దగా ఆశ్చర్యం అక్కర్లేదనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఎలాగూ రేపు కేంద్రంలో మోడీకే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మోడీకి వ్యతిరేకంగా చాలా పక్షాలు ఏకం అయినా.. మెజారిటీ సీట్లు నెగ్గేది మాత్రం బీజేపీనే! ఈ విషయాన్ని చంద్రబాబు కూడా చెబుతున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీనే అవుతుందన్నట్టుగా బాబు మాట్లాడారు.

ఇక మోడీ కక్ష సాధింపు చర్యలు.. అనే విషయంలో కూడా బాబు అనుకూల మీడియా టోన్ మారింది. మోడీ కక్ష  సాధింపు చర్యలు చేపట్టినా దాని ద్వారా మేలే జరిగిందంటూ..ఒక వాదనను మొదలుపెట్టారు. అలాగే పోలింగ్ కు సమయం దగ్గర పడ్డాకా.. 'పసుపు-కుంకుమ' పేరుతో డబ్బులు పంచడానికి డబ్బులు అప్పు తీసుకురావడంలో కూడా బాబుకు కేంద్రం నుంచి సహకారం అందిదనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో మోడీతో బాబు టచ్లోనే ఉన్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.