Begin typing your search above and press return to search.

భార్య బ‌లవంతం వ‌ల్లే అప్ప‌ట్లో బాబు వ‌చ్చార‌ట‌

By:  Tupaki Desk   |   17 Jan 2018 4:16 AM GMT
భార్య బ‌లవంతం వ‌ల్లే అప్ప‌ట్లో బాబు వ‌చ్చార‌ట‌
X
విష‌యం ఏదైనా.. తన వ‌ల్లే అన్న మాట ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నోటి నుంచి వ‌స్తుంటుంది. కొంత‌మంది బాబు మాట‌ల్ని కామెడీ చేసుకుంటూ ఉంటారు. అన్ని కాకున్నా కొన్నింటిని స్టార్ట్ చేసింది మాత్రం చంద్ర‌బాబేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తాజాగా.. సంక్రాంతి పండ‌క్కి సొంతూరుకు వెళ్లే కాన్సెప్ట్ న త‌మ కుటుంబ‌మే స్టార్ట్ చేసిందంటూ గ‌డిచిన మూడు రోజులుగా బాబు త‌ర‌చూ చెబుతున్నారు. ఈ సంప్ర‌దాయం పెరిగి పెద్ద‌దై.. సంక్రాంతి వేళ‌ న‌గ‌రాలు ఖాళీ అయ్యే ప‌రిస్థితికి వ‌చ్చింద‌ని ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నారు.

సంక్రాంతి పండ‌క్కి సకుటుంబ స‌మేతంగా త‌మ సొంతూరు నారా వారి ప‌ల్లెకు వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చేస్తున్న సంద‌డి అంతా ఇంతా కాదు. ఏడాది మొత్తం ఎక్క‌డున్నా.. సంక్రాంతి నాలుగు రోజులు సొంతూరుకువ‌చ్చే సంప్ర‌దాయాన్ని తాము స్టార్ట్ చేశామ‌ని.. ఇప్పుడు అంద‌రూ త‌మ గ్రామాల‌కు వెళుతున్నార‌ని చెప్పుకొచ్చారు.

పండ‌క్కి నారావారి ప‌ల్లెకు వ‌చ్చిన చంద్ర‌బాబు.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం మంగ‌ళ‌గిరికి బ‌య‌లుదేరారు. ఈ సంద‌ర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సంక్రాంతికి సొంతూరుకు వెళ్లాల‌న్న సంప్ర‌దాయాన్ని త‌న భార్య కార‌ణంగా తాను స్టార్ట్ చేశాన‌న్నారు. ప‌దిహేనేళ్ల క్రితం త‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి నారావారిప‌ల్లెకు వెళ‌దామ‌ని ప‌ట్టుబ‌ట్టింద‌ని.. తాను ఒప్పుకోక త‌ప్ప‌లేద‌న్నారు.

మొద‌ట్లో ఇబ్బందిగా ఉండేద‌ని.. ఇప్పుడు అల‌వాటైపోయింద‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ జ‌న్మ‌భూమి రుణం తీర్చుకోవాల‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఉపాధి కోసం అమెరికా.. ఆస్ట్రేలియా.. బెంగ‌ళూరు వెళుతున్నార‌ని.. సంక్రాంతి పండ‌క్కి అంద‌రూ గ్రామాల‌కు రావ‌టం వ‌ల్ల న‌గ‌రాలు ఖాళీ అవుతున్నాయ‌న్నారు. పండ‌క్కి ఇలా రావ‌టం వ‌ల్ల గ్రామాల్లో మౌలిక స‌దుపాయాలు పెరుగుతాయ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. తాను సొంతూరుకు ప్ర‌తి సంక్రాంతికి రావ‌టానికి కార‌ణ‌మైన స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి థ్యాంక్స్ చెప్పారు. మొత్తానికి సంక్రాంతికి సొంతూరుకు వెళ్లే కాన్సెప్ట్ త‌న ఇంటి నుంచే షురూ అయ్యింద‌ని గ‌త మూడు రోజులుగా చెప్పిన చంద్ర‌బాబు.. తాజాగా ప్రెస్ మీట్ లో ఆ క్రెడిట్ ను భార్య ఖాతాలో వేయ‌టం ద్వారా.. ఈ సంప్ర‌దాయం త‌మ‌దేన‌ని మ‌రోసారి ఉద్ఘాటించిన‌ట్లైంది.