Begin typing your search above and press return to search.

ప‌ర‌కాల రాజీనామా వెనుక బాబు వ్యూహం!

By:  Tupaki Desk   |   21 Jun 2018 12:50 PM GMT
ప‌ర‌కాల రాజీనామా వెనుక బాబు వ్యూహం!
X
ఆరు నెల‌లు సావాసం చేస్తే వారు వీర‌వుతార‌ని ఓ సామెత ఉంది. ఇక 40 ఏళ్ల సుదీర్ఘ‌మైన రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు వంటి `గోబెల్స్ `ఉద్దండ పిండంతో నాలుగేళ్ల పాటు సావాసం చేస్తే క‌చ్చితంగా ఎవ‌రైనా చంద్ర‌బాబు కావాల్సిందే. చంద్ర‌బాబు మార్గ‌ద‌ర్శ‌కత్వంలో `లోపాయికారి` - చీక‌టి ఒప్పందాలు చేసుకోవ‌డంలో తెలుగు త‌మ్ముళ్లు ఎంత ముదిరిపోయారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌ర‌సం లేదు. అయితే, ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ కూడా తెలుగు త‌మ్ముళ్ల కంటే రెండాకులు ఎక్కువే చ‌దివారు. త‌నపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కుగానూ త‌న ప‌ద‌విని తృణ‌ప్రాయంగా వదిలేసిన‌ట్లు ప్ర‌జ‌ల‌ను భ్ర‌మింప‌జేసిన ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ రాజీనామా వెనుక ఉన్న మాస్ట‌ర్ ప్లాన్ తెలిస్తే రాజ‌కీయ ఉద్దండులు - మేధావులకు సైతం దిమ్మ‌దిరిగి మైండ్ బ్లాంక్ కావాల్సిందే. తానేదో త్యాగం చేసిన‌ట్లు ఫీల్ అవుతున్న ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్....రాజీనామా వెనుకున్న అస‌లు మ‌త‌ల‌బు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మ‌రో 15 రోజుల్లో త‌న ప‌దవీ కాలం ముగియ‌నుంద‌ని తెలిసిన ప్ర‌భాక‌ర్....రాజీనామా డ్రామాతో ఏపీ ప్ర‌జ‌ల‌ను మభ్య‌పెట్టాల‌ని చూసిన వైనం తెలుసుకొని ప‌లువురు ఉద్దండ పిండాలు కూడా నోళ్లు వెళ్ల‌బెడుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు.

పైకి బీజేపీతో క‌టీఫ్ చెప్పిన‌ప్ప‌టికీ బీజేపీతో టీడీపీకి లోపాయికారి ఒప్పందాలున్నాయ‌ని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ గ‌గ్గోలు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించ‌డం ఏమిట‌ని జ‌గ‌న్ నిలదీశారు. దాంతోపాటు - కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ భ‌ర్త అయిన ప‌రకాల ప‌ద‌విలో ఎలా కొన‌సాగుతార‌ని జ‌గ‌న్ సంధించిన ప్ర‌శ్న‌లు టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ నేప‌థ్యంలోనే ఆ వ్యాఖ్య‌ల‌కు స్పందించిన‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చిన చంద్ర‌బాబు....త‌మ గుట్టు ర‌ట్టు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ రాజీనామా పేరుతో కొత్త నాట‌కానికి తెర‌లేపారు. జ‌గ‌న్ ఆరోపణలు చేయ‌డంతోనే ప‌ర‌కాల ప‌దవిని త్య‌జించార‌ని చెప్పి....బీజేపీ–టీడీపీ చీక‌టి ఒప్పందాన్ని క‌ప్పిబుచ్చాల‌ని చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. ప్రజల దృష్టిని ఆ విష‌యం నుంచి త‌ప్పించేందుకు చంద్రబాబు వ్యూహ ర‌చ‌న చేశారు. అయితే, తాజాగా ప‌ర‌కాల అపాయింట్ మెంట్ లెట‌ర్ బ‌య‌ట‌కు రావ‌డంతో బాబు గారి బాగోతం బ‌ట్ట‌బ‌య‌లైంది.

అయితే, ఆ రాజీనామా వెనుక విస్తుపోయే వ్యూహం ఉన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పరకాల పదవీకాలం జూలై 4 - 2018 నాటికి పూర్తి కానుంది. అది కూడా 2016లో ప‌ర‌కాల ప‌ద‌వీ కాలానికి రెండేళ్ల పాటు పొడ‌గింపు ల‌భించ‌డంతో సాధ్య‌ప‌డింది. కాబ‌ట్టి...లెక్క ప్ర‌కారం మ‌రో 15రోజుల్లో ప‌ర‌కాల ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాలి. ఇంకేముంది, ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న త‌ర‌హాలో చంద్ర‌బాబు కుటిల రాజ‌కీయాల‌కు మ‌రోసారి తెర తీశారు. హఠాత్తుగా ప‌ర‌కాల‌తో రాజీనామా చేయించి మైలేజి కొట్టేద్దామ‌ని చూశారు. అయితే, ప‌ర‌కాల అపాయింట్ మెంట్ లెట‌ర్ బ‌ట్ట‌బ‌య‌ల‌వ‌డంతో చంద్ర‌బాబు గుట్టు ర‌ట్ట‌యింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆ లెట‌ర్ వైర‌ల్ అయింది. దానిపై నెటిజ‌న్లు తూర్పార పెడుతున్నారు. బీజేపీతో టీడీపీ క‌టీఫ్ చెప్పిన వెంట‌నే ప‌ర‌కాల రాజీనామా ఎందుకు చేయ‌లేద‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్....ప‌ర‌కాల పద‌విపై ప్ర‌శ్నించిన వెంట‌నే ఎందుకు స్పందించ‌లేద‌ని మండిప‌డుతున్నారు. కేవలం ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికే ఇటువంటి డ్రామా రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు పాల్ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేస్తున్నారు.