Begin typing your search above and press return to search.

కొత్త గేమ్; ‘‘నాలుగు’’ మీద ఫోకస్ చేసిన బాబు

By:  Tupaki Desk   |   30 May 2016 4:56 AM GMT
కొత్త గేమ్; ‘‘నాలుగు’’ మీద ఫోకస్ చేసిన బాబు
X
సాదాసీదాగా సాగిపోతుందని భావించిన రాజ్యసభ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు ఎంపిక కావాల్సిన నేపథ్యంలో.. అధికారపక్షం ముగ్గురిని.. విపక్షం ఒకరిని ఎంపిక చేసుకోవటం ద్వారా.. ఈ ఎన్నికలు ఎలాంటి ఆసక్తిని రేకెత్తించవన్న భావన వ్యక్తమైంది. అయితే.. ఈ అంచనా తప్పన్న విషయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నారని చెబుతున్న తాజా నిర్ణయం స్పష్టం చేస్తుందని చెప్పాలి. ఇప్పటివరకూ ముగ్గురు అభ్యర్థులు (టీడీపీ నుంచి ఇద్దరు.. బీజేపీకి ఒకరు) బరిలోకి దిగటం.. మూడు స్థానాల్ని చేజిక్కించుకోవాలని టీడీపీ భావిస్తుందని భావించారు.

అయితే.. అందుకు భిన్నంగా తనకు బలం లేని నాలుగో సీటు మీద కూడా చంద్రబాబు ఫోకస్ చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మూడు కాస్తా నాలుగు కావటంతో రాజ్యసభ ఎన్నికలు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ను ఒక్కసారిగా పెంచేశాయని చెప్పాలి. ముగ్గురికి మాత్రమే బలం ఉన్నప్పటికి నాలుగో స్థానానికి కూడా పోటీ పడాలని బాబు ఎందుకు అనుకుంటున్నారు? నాలుగో స్థానాన్ని ఎలా సొంతం చేసుకోనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బాబు అండ్ కో గేమ్ ప్లాన్ చూస్తే.. టీడీపీ తరఫున ఇద్దరు అభ్యర్థుల్నిబరిలోకి దింపటం.. మరో అభ్యర్థిని మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించటంతో ఒక ప్రక్రియ పూర్తి అవుతుంది. తనకు చెందని నాలుగో స్థానం విషయానికి వస్తే.. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి అధికారపార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలకు అదనంగా మరో 15 మంది ఎమ్మెల్యేలు కానీ చేయి వేస్తే.. నాలుగో రాజ్యసభ స్థానం బాబు కోటా కిందకు వెళ్లిపోవటం ఖాయం. అయితే.. ఇది అనుకున్నంత ఈజీ కాదు. అందుకే.. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీలుగా.. నాలుగో స్థానం కోసం పార్టీ పరంగా అభ్యర్థిని ప్రకటించకుండా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నారు.

స్వతంత్ర అభ్యర్థి బరిలోకి దిగటం ద్వారా.. జంప్ అయిన పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. తనకుఅత్యంత సన్నిహితుడైన విజయ సాయి రెడ్డిని రాజ్యసభ బరిలోకి దింపిన జగన్ కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వటానికి రాజ్యసభ ఎన్నికకు మించింది లేదన్న భావనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ మారిన వారికి అదనంగా మరో 15 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాల్సిన నేపథ్యంలో.. పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బాబు మాటకు తగినట్లుగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. మరో ఐదుగురిని ఎంపిక చేసుకుంటే లెక్క మొత్తం సెట్ కావటమే కాదు.. జగన్ కు ఊహించని షాక్ ఇవ్వటం ఖాయమంటున్నారు. వ్యూహం పరంగా చూస్తే అంతాబాగానే ఉన్నట్లుగా కనిపిస్తున్న ఈ కొత్త గేమ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవంతంగా ఎలా పూర్తి చేస్తారన్నది ఆసక్తిని రేకెత్తించే అంశంగా చెప్పక తప్పదు.