Begin typing your search above and press return to search.

`రాక్ష‌సులు` అంటూ బాబు రెచ్చిపోయారుగా

By:  Tupaki Desk   |   18 Nov 2017 5:30 PM GMT
`రాక్ష‌సులు` అంటూ బాబు రెచ్చిపోయారుగా
X
సీఎం చంద్ర‌బాబు నోటీ ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వ‌స్తున్న `రాక్ష‌సులు` అనే మాట మ‌రోసారి తాజాగా శ‌నివారం కూడా వినిపించింది. రాష్ట్రాన్ని తాను త‌న బృందం ఎంత‌గానో క‌ష్టించి అభివృద్ధి చేస్తున్నామ‌ని, అయితే - కొంద‌రు `రాక్ష‌సులు` మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న ప‌దే ప‌దే ఎక్క‌డ మైకు ప‌ట్టుకున్నా కామెంట్ల‌తో ఇర‌గ‌దీస్తున్నారు. తాజాగా శ‌నివారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలోనూ చంద్ర‌బాబు మ‌రోసారి `రాక్ష‌సులు` అంటూ రెచ్చిపోయారు. రాక్ష‌సులు అభివృద్ధికి అడ్డు ప‌డుతున్నారంటూ నిప్పులు చెరిగారు. అయినా కూడా తాను కానీ, త‌న బృందం కానీ, అధికారులు కానీ వెనక్కి త‌గ్గేది లేద‌ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వ‌ర‌కు నిద్ర పోమ‌ని ఆయ‌న వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

విష‌యంలోకి వెళ్తే.. శనివారం ఏపీ రాజ‌ధాని ప్రాంతం అమరావతిలో సీఎం చంద్ర‌బాబు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మందడంలోని సీడ్ యాక్సెల్ రోడ్డు దగ్గర మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి కొందరు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని అన్నారు. రాజధాని నిర్మాణం జరగకుండా హైకోర్టు - గ్రీన్‌ ట్రిబ్యునల్లో కేసులు వేశారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని నిర్మాణం ఆగదని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచం మెచ్చే గ్రీన్‌ - బ్లూ సిటీగా అమరావతి నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.

అందరికీ సామాజిక స్పృహ ఉండాలని, ప్రకృతిని కాపాడుకుంటే.... ప్రకృతే మనల్ని కాపాడుతుందని, వాతావరణ సమతుల్యం దెబ్బతినడం వల్లే ప్రకృతి విపత్తులు వస్తున్నాయన్నారు. టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయని, అందుకు అనుగుణంగా మనం కూడా మారాలని అన్నారు. రాష్ట్రంలో సోలార్‌ విద్యుత్‌ కు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. అలాగే ఏపీలో ఎలక్ట్రిక్‌ వాహనాలు రాబోతున్నాయని చెప్పారు. అమరావతిలో రహదారికిరువైపులా విరివిగా మొక్కలు నాటాలని, మూడు వేల కిలోమీటర్ల మేర సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్ని వస్తువులనైనా తయారు చేసుకోవచ్చు కానీ వర్షాన్ని కురిపించలేమని సీఎం చెప్ప‌డం గ‌మ‌నార్హం. చెట్లను పరిరక్షిస్తేనే సకాలంలో వర్షాలు పడతాయన్నారు. మొత్తానికి బాబు రాక్ష‌సుల కామెంట్లు మాత్రం అంద‌రినీ న‌వ్విస్తున్నాయ‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు!!