Begin typing your search above and press return to search.

ఎవరక్కడ..? బాబుకు ఇంగ్లీష్ రాదంటారా?

By:  Tupaki Desk   |   25 Sep 2016 6:01 AM GMT
ఎవరక్కడ..? బాబుకు ఇంగ్లీష్ రాదంటారా?
X
ఏపీ సీఎం చంద్రబాబు బాగా స్వాభిమానం ఉన్న వ్యక్తి. ఎవరైనా ఆయన్ను కించపర్చినా - తక్కువ చేసి మాట్లాడినా - వేలెత్తి చూపించినా తట్టుకోలేరు. ఏదైనా లోపాన్ని చూపిస్తే ఆ లోపం లేదని నిరూపించుకోవడమో.. లేదంటే దాన్ని అధిగమించడమో చేసేంతవరకు నిద్రపోరు. పట్టిన పట్టు వీడని నైజం ఆయనది. అంతేకాదు... తాను మేధావిని.. అభివృద్ధికి మారుపేరునని... ఆర్థికవేత్తనని అనుకుంటూ ఉంటారు. అలాంటి గ్రేట్ చంద్రబాబును పట్టుకుని వైసీపీ నేత జగన్ ఊహించని మాట అనేసరికి ఆయన తట్టుకోలేకపోతున్నారట. చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదని జగన్ అనడంతో చంద్రబాబుకు తలకోట్టేసినంత పనైంది. దాంతో చంద్రబాబు ఆ విషయంపై స్పందించి ''నాకు ఇంగ్లీష్ రాదంటావా.. నేను ఎస్వీ యూనివర్సిటీలో పీజీ చదివాను" అంటూ జగన్ ఉద్దేశించి మండిపడ్డారు.

దోమలపై దండయాత్ర సందర్భంగా చంద్రబాబు .. జగన్ పైనా దండయాత్ర చేస్తున్నారు. జగన్ ను టార్గెట్ చేసి విమర్శలు కురిపిస్తున్నారు. జగన్ ఇటీవల నిర్వహించిన యువభేరిపై చంద్రబాబు మండిపడ్డార. జగన్ విద్యార్థులతో సమావేశాలు పెడుతున్నారని.. వాటికెళ్తే ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలో వివరిస్తారని, నేరాలెలా చేయాలో చెబు తారని.. జైళ్ళనుంచి ఎలా బయటపడాలో కూడా శిక్షణ ఇస్తారని.. కాబట్టి తల్లిదండ్రులెవరూ తమ పిల్లలను ఆ సభలకు పంపించరాదని ఆయన పిలుపునిచ్చారు.

అలాగే ఇంగ్లీష్ రాదంటూ తనపై జగన్ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన సమాధానమిచ్చారు. తనకు ఇంగ్లీష్ రాదని ఇంతవరకూ ఎవరూ అనలేదని.. దేశవిదేశాల్లో తిరిగొచ్చినవాడినని.. ఎస్వీ యూనివర్సిటీలో పీజీ చదివానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే... ఎస్వీ యూనివర్సిటీలో పీజీ చేసినంత మాత్రాన ఇంగ్లీష్ వస్తుందన్న గ్యారంటీ ఏమిటో మాత్రం ఆయన చెప్పలేదు. అయితే... చంద్రబాబు గురించి బాగా తెలిసినవారు మాత్రం జగన్ ఆ మాట అనకపోవాల్సింది అంటున్నారు. అందుకు కారణమూ చెబుతున్నారు వారు. తనకూ ఇంగ్లీష్ వచ్చని నిరూపించుకోవడానికి చంద్రబాబు ఇకపై తెలుగు మాట్లాడడం మానేసి ఇంగ్లీష్ లోనే మాట్లాడితే కష్టమని.. ఆయన తెలుగులో మాట్లాడితేనే తట్టుకోలేకపోతున్నామని.. ఇంగ్లీష్ లో మాట్లాడితే విలేకరులు ఏమైపోవాలని అంటున్నారు.