Begin typing your search above and press return to search.

స‌భ జ‌ర‌గ‌కుండా చేస్తోంది బీజేపీనేనా?

By:  Tupaki Desk   |   20 March 2018 4:36 AM GMT
స‌భ జ‌ర‌గ‌కుండా చేస్తోంది బీజేపీనేనా?
X
బాబు మ‌న‌సులో ఏదైనా ప‌డితే.. ఇక దాని సంగ‌తి చూసేంత‌వ‌ర‌కూ వ‌దిలిపెట్ట‌రు. ఇందుకు త‌గ్గ‌ట్లే తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీ.. ప‌వ‌న్.. జ‌గ‌న్ ల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. పాల‌నను వ‌దిలేసి.. అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేయ‌ట‌మే ప‌నిగా బాబు పెట్టుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. రోజుకు నాలుగైదు సార్లు చెప్పిందే చెబుతూ.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణలు చేస్తున్నారు చంద్ర‌బాబు.

నాలుగేళ్లుగా మోడీ స‌ర్కారు చెప్పిన‌ట్లుగా విన్న చంద్ర‌బాబు.. ఏపీలో ప్ర‌జ‌ల భావోద్వేగాలు హోదా చుట్టూ తిరుగుతున్నాయ‌న్న విష‌యాన్ని గుర్తించి.. త‌న స్వ‌రాన్ని మార్చుకున్నారు. అప్ప‌టి నుంచి హోదా కోసం నాలుగేళ్లుగా అలుపుసొలుపు లేకుండా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇస్తున్నారు బాబు.

హోదాపై బాబు వేసిన‌న్ని పిల్లిమొగ్గ‌లు ఎవ‌రూ వేయ‌లేద‌నే చెప్పాలి. హోదా సాధ‌న కోసం బీజేపీతో క‌టీఫ్ ఇచ్చిన‌ట్లుగా క‌ల‌ర్ ఇస్తున్న చంద్ర‌బాబు.. పార్టీ నేత‌ల్లో స‌మ‌ర‌స్ఫూర్తిని పెంచేందుకు కిందా మీదా ప‌డుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు జ‌రిగిన అన్యాయంపై దేశం మొత్తం సానుభూతితో ఉంద‌ని.. అనేక పార్టీల నుంచి మ‌ద్ద‌తు వ‌స్తోంద‌ని.. ఐదు కోట్ల మంది ప్ర‌జ‌లు మ‌న వెనుక ఉన్నారు.. మీరు ఏ మాత్రం త‌గ్గ‌కుండా పోరాడండంటూ పార్టీ వ‌ర్గాల‌కు పిలుపునిచ్చారు.

నాలుగేళ్లుగా విమ‌ర్శ‌లు చేయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు యూట‌ర్న్ ఎందుకు తీసుకున్నారో అంద‌రికి తెలుస‌న్న చంద్ర‌బాబు.. గ‌డిచిన నాలుగేళ్లుగా మోడీ స‌ర్కారుపై ఒత్తిడి పెంచ‌ని ఆయ‌న ఇప్పుడే త‌న స్టాండ్ ఎందుకు మార్చుకున్న‌ట్లు? అన్న విష‌యంపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

త‌న‌కు ప్ర‌త్య‌ర్థులైన వారిని త‌ర‌చూ ద్రోహులుగా చిత్రీక‌రించే చంద్ర‌బాబు.. ఈసారి ప‌వ‌న్.. బీజేపీ.. జ‌గ‌న్ ల‌పై ఇదే త‌ర‌హా తిట్ల దండ‌కాన్ని షురూ చేశారు. కుట్ర రాజ‌కీయాల్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని.. తాము పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చ‌ర్చ‌కు రానివ్వ‌కుండా చేయ‌టానికి బీజేపీ కుట్ర ప‌న్నుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు.

ఏపీలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సైకిల్‌.. టూవీల‌ర్ల‌తో ర్యాలీలు నిర్వ‌హించాల‌ని.. హోదా సెంటిమెంట్ ను మ‌రింత ర‌గ‌ల్చాల‌ని.. మోడీ కార‌ణంగా ఏపీకి జ‌రిగిన న‌ష్టంపై క‌ర‌ప‌త్రాలు పంచాలంటూ పిలుపునిచ్చారు. ప్ర‌తిరోజూ అవివ్వాస తీర్మానాన్ని ఇస్తున్నా.. అది చ‌ర్చ‌కు రాకుండా బీజేపీ కుట్ర ప‌న్నుతోంద‌ని ఆయ‌న మండిప‌డుతున్నారు. బాబు తీరు చూస్తే.. హోదా కోసం ఏపీలో తాను మాత్ర‌మే పోరాడుతున్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇవ్వ‌టం క‌నిపిస్తుంది.