Begin typing your search above and press return to search.

ఏపీలో మట్టికి.. నీటికి పూజలే పూజలు

By:  Tupaki Desk   |   13 Oct 2015 4:47 AM GMT
ఏపీలో మట్టికి.. నీటికి పూజలే పూజలు
X
చేతికి వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోవటానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని అత్యంత భారీగా నిర్వహించి అందరి మనసులు దోచుకోవాలన్న తపనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని నభూతో నభవిష్యతి అన్నట్లుగా నిర్వహించటం.. ఇలాంటి భారీతనం బాబు హయాంలో తప్ప మరెవరికీ సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు విపరీతంగా కష్టపడుతున్నారు.

విభజన నాటి గాయాలు ఏపీ ప్రజల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇక.. విపక్ష నేత జగన్ చేసిన ప్రత్యేకహోదా దీక్ష ప్రభావం ఎంతోకొంత సీమాంధ్రుల మీద ఉండటం ఖాయం. విభజన కారణంగా తమకు జరిగిన నష్టాన్ని.. ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీలతో ఎంతోకొంత నష్టనివారణ జరుగుతుందన్నది ఏపీ ప్రజల ఆశ. అయితే.. అందుకు భిన్నంగా మోడీ సర్కారు నుంచి ఎలాంటి హామీ రాని నేపథ్యంలో సీమాంధ్రుల్లోఈ అసంతృప్తి చాలానే ఉంది.

ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం కరకుగా ఉన్న నేపథ్యంలో.. మోడీతో గొడవ కంటే కూడా.. సర్దుబాటుతో పాలన సాగించాలని చంద్రబాబు తలపోస్తున్నారు. కేంద్రంలో బలంగా ఉన్న మోడీతో గొడవ పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదని.. ఇదేమాత్రం మంచిది కాదన్న ఆలోచనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా అంశాన్ని కావాలనే మర్చిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు.

ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకుండా శంకుస్థాపన మహోత్సవాన్ని భావోద్వేగంతో ముడి పెట్టి.. రాజధాని నిర్మాణంలోకి ఏపీ ప్రజల ఫోకస్ పెరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. వీలైనంతగా ఏపీలోని 13 జిల్లాల ప్రజలు శంకుస్థాపన కార్యక్రమంలో మమేకం అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భవిష్యత్తులో ఏపీ రాజధాని నిర్మాణం మరో విభజనకు కారణం కాకూడదన్న ముందుచూపుతో.. ఏపీ మొత్తం రాజధానిలో భాగస్వమ్యం అయ్యేలా.. అందరికి వాటా ఉందన్న విషయాన్నిస్పష్టం చేస్తూ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఊరికి చెందిన మట్టిని.. పవిత్ర జలాల్ని సేకరించటం వాటికి పూజలు.. భారీ ఊరేగింపు.. ఆ తర్వాత మళ్లీ మరో దఫా పూజలు.. చివరకు గుంటూరుకు చేర్చిన తర్వాత వాటికి మళ్లీ పూజలు నిర్వహించటం లాంటివి చేస్తున్నారు.

రాజధాని నిర్మాణం కోసం ఏపీలోని అన్ని గ్రామాల్లో సేకరిస్తున్న పుట్టమట్టి.. పవిత్ర జలాల విషయంలో వీలైనన్ని ఎక్కువ పూజలు జరిపేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని మరపించి.. పండుగ వాతావరణ నెలకొనేలా చేస్తున్నారు. విబజన కారణంగా ఏపీ ఎంత నష్టపోయిందన్నఅంశాల్ని మర్చిపోయేలా చేయాలన్న చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్లే కార్యక్రమాల రూపకల్పన సాగుతోంది. మట్టి.. నీటితో ఏపీ రాజధాని సెంటిమెంట్ ను సీమాంధ్రుల్ని రగించేలా చేయాలని భావిస్తున్న చంద్రబాబు ప్లాన్ ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి.