Begin typing your search above and press return to search.

కొడుకు ‘కెరీర్’ మీద బాబు ఫోకస్

By:  Tupaki Desk   |   27 Aug 2016 4:48 AM GMT
కొడుకు ‘కెరీర్’ మీద బాబు ఫోకస్
X
రాజకీయాల్లో విపరీతమైన అనుభవం ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో కొన్ని కోణాలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తాయి. విశేష అనుభవం ఉన్న ఆయన కొన్ని విషయాల్లో ఎంత దూకుడుగా ఉంటారో.. మరికొన్ని విషయాల్లో అంతే నెమ్మదిగా ఉంటారు. చాలా అవసరమైన కొన్ని అంశాల విషయంలోనూ నిర్ణయాలు తీసుకునేందుకు చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు.ఎక్కడిదాకానో ఎందుకు నేతల మధ్య ఏదైనా లొల్లి చోటు చేసుకుంటే.. అవే సర్దుకు పోతాయన్నట్లుగా చూసీచూడనట్లుగా ఉంటారే తప్పించి.. మొదలే చెక్ చెప్పి.. పద్ధతి మార్చుకొమ్మంటూ ఘాటుగా అయితే రియాక్ట్ కారు. పార్టీ నేతల మీద పట్టు ఉన్నా.. ఆయన అలా వ్యవహరించేందుకు అస్సలు ఇష్టపడరు.

ఇదే రీతిలో తన కుమారుడ్ని విపరీతంగా ఫోకస్ చేసేందుకు ఇష్టపడరు. నిజానికి చంద్రబాబు నాయుడు లాంటి నేత అనుకోవాలే కానీ.. తన కొడుక్కి పదవులు ఇప్పించుకోవటం పెద్ద విషయం కాదు. తాను యాక్టివ్ గా ఉన్న వేళ.. కొడుకును కూడా తెరపైకి తీసుకొస్తే కుటుంబ పాలన అన్న విమర్శ తలెత్తే అవకాశం ఉన్న కారణంగా.. కొడుక్కి పదవులు ఇచ్చే విషయంలో ముందు వెనుకా ఆడుతుంటారు.

అందుకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పాతికనెలలు దాటుతున్నా.. పార్టీలోని పలువురు సీనియర్లు చినబాబుకు మంత్రి పదవి ఇవ్వాలంటూ వ్యాఖ్యానించినా ఆ విషయంపై సూటిగా సమాధానం ఇవ్వకుండా మాట తప్పించే ప్రయత్నం చేశారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాత్రమే కాదు.. మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా.. ఆయన సానుకూలంగా స్పందించరు. సమయం వచ్చినప్పుడు జరుగుతుందంటూ ఆ విషయాన్ని అక్కడితో ముగించే ప్రయత్నం చేస్తారు తప్పించి.. ఈ విషయంపై చర్చ జరగాలని అస్సలు అనుకోరు. తనను తాను హైటెక్ ముఖ్యమంత్రినన్న ఇమేజ్ కలుగజేసే ప్రయత్నాన్ని గడిచిన రెండు రోజులుగా వివిధ మీడియాలకు ప్రత్యేకంగా సమయం ఇచ్చి మరీ తనను తాను ఎంతలా ఫోకస్ చేసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

ఈ సందర్భంగా బాబుకు ఒక ప్రశ్నఎదురవుతోంది. చినబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారా? అని. దీనిపై ఆయన సమాధానం చెప్పనప్పటికీ.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. వీలైనంత త్వరగా మంత్రివర్గంలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాబుకు సన్నిహితంగా ఉండే వారి మాటల ప్రకారం.. చినబాబును మంత్రివర్గంలోకి తీసుకునే విషయంలో చంద్రబాబు ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. ఒక వర్గం కథనం ప్రకారం బాబు వీలైనంత త్వరగా చినబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెబుతుంటే.. మరోవర్గం మాత్రం ఇప్పట్లో అలాంటిదేమీ లేదని చెబుతున్నారు.

ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కాకుండా.. పరోక్ష పద్ధతిలో చినబాబుకు మంత్రిపదవిని కట్టబెడితే ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్న భావనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. లోకేశ్ ఇమేజ్ ను మంత్రి పదవితో పెంచిన పక్షంలో.. ఆయనకు ప్రజామోదం ఎంతన్నవిషయంపై పలువురు సందేహాలు లేవనెత్తి అనవసరమైన ప్రచారాన్ని చేసే వీలుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు దీన్నో అవకాశంగా తీసుకుంటే లోకేశ్ విమర్శల చట్రంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందుకే.. లోకేశ్ ను మంత్రి పదవి ఇచ్చేందుకు.. ప్రత్యక్షఎన్నికల ద్వారా ఎంపికయ్యాకే ఆ విషయాన్ని చూడాలని పలువురు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.

లోకేశ్ కున్న ప్రజాబలాన్ని ఎన్నికల రూపంలో ప్రదర్శించిన తర్వాతే మంత్రిపదవిని అందుకుంటే మంచిదన్న భావనను పలువురు నేతలు వ్యక్తం చేయటం కనిపిస్తుంది. ఏది ఏమైనా లోకేశ్ కు మంత్రిపదవిని ఇచ్చే విషయంలో తొందరపాటు పనికి రాదన్న మాట పలువురి నోటి నుంచి రావటం కనిపిస్తుంది. మంత్రి పదవికి కంటేకూడా లోకేశ్ సమర్థత అందరికి అర్థమయ్యేలా చేసేందుకు చంద్రబాబు తపిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేశ్ ఇమేజ్ బిల్డింగ్ మీదనే బాబు దృష్టి ఉన్నట్లుగా చెప్పొచ్చు. మంత్రిని చేసి క్యాబినెట్ లో భాగస్వామ్యం చేసే కన్నా.. ప్రజల్లో చినబాబు మార్క్ పడే కార్యక్రమం ఒకటి దిగ్విజయంగా పూర్తి చేసిన తర్వాతనే మంత్రి పదవి ఇవ్వాలన్నది బాబు ఆలోచనగా చెబుతున్నారు. మీడియా.. పార్టీ నేతలు ఇప్పటికిప్పుడు లోకేశ్ ను మంత్రిని చేయమన్నట్లుగా వ్యవహరిస్తున్నా.. బాబు మాత్రం ఈ విషయంలో తొందరపడకూడదన్న భావనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.