Begin typing your search above and press return to search.

బెజ‌వాడ‌పై బాబు ఎమోష‌న్ అయ్యాడే

By:  Tupaki Desk   |   27 July 2016 5:30 PM GMT
బెజ‌వాడ‌పై బాబు ఎమోష‌న్ అయ్యాడే
X
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు ఎమోష‌న్ అయ్యారు. బెజ‌వాడ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రారంభం సందర్బంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు రాజ‌ధాని స్థాయి న‌గ‌రం ఉన్న విజ‌య‌వాడ‌ను కాంగ్రెస్ పాల‌కులు నిర్ల‌క్ష్యంగా చూపార‌ని మండిప‌డ్డారు. రామవరప్పాడు నుంచి నుంచి గొల్లపూడి వరకు 9.84 కిలోమీటర్ల మేర రెండు హైవేలను కలుపుతూ రోడ్డు నిర్మాణం చేపట్టడం ద్వారా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ప‌రిష్కారం చూప‌లేద‌ని మండిప‌డ్డారు. అందుకోస‌మే తాము ఈ రింగ్ రోడ్డు పనుల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని కేవలం 18 నెలల్లోనే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశామని చంద్రబాబు ప్ర‌క‌టించారు.పాత విజయవాడ వేరు..అభివృద్ధి చెందుతున్న విజయవాడ వేరని చంద్రబాబు ప్ర‌క‌టించారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఇకనుంచి హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలను ఇన్నర్ రింగ్ రోడ్డుకు మళ్లించనున్నారు. త‌ద్వారా న‌గ‌రంపై ట్రాఫిక్ ఒత్తిడి త‌గ్గుతుండ‌టాన్ని ప్ర‌స్తావిస్తూ ఇంత‌టి కీల‌క‌మైన ప్రాజెక్టు విష‌యాన్ని మ‌రిచిన‌ కాంగ్రెస్‌ ను ఏమ‌నాల‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పాలకులు విజయవాడ పట్ల చూపించిన నిర్లక్ష్యానికి తన గుండె తరుక్కుపోయిందని - విజయవాడ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీశారని ఆయ‌న మండిప‌డ్డారు. అందుకే ఇన్న‌ర్ రింగ్‌ రోడ్డు పూర్తిచేయ‌డం ద్వారా - ఇత‌ర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నగరానికి ఓ షేప్ తీసుకొస్తున్నామని తెలిపారు. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలోని సీడ్ క్యాపిటల్ కు ఇన్నర్ రింగ్ రోడ్లను అనుసంధానం చేస్తామని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. ఈ అనుసంధానం - ఇన్న‌ర్ రింగ్ రోడ్ వ‌ల్ల అభివృద్ధి త్వ‌రిత‌గ‌తిన జ‌రుగుతుంద‌ని చంద్ర‌బాబు ఆశాభావం వ్య‌క్తం చేశారు.