చంద్రబాబు కన్నడ ప్రసంగం ఇలా..!

Mon Apr 15 2019 22:06:03 GMT+0530 (IST)

మండ్య జనతకు నమస్కారగలు. ఇల్లిగె బందిగె సంతోష ఇదె. దేవెగౌడ ముమ్మగ.. సీఎం కుమారస్వామి మగ.. నమ్మ జాగ్వార నిఖిల్ స్వర్ధిసుద్దారె. నిఖిల్ పర ప్రచారకే నాను ఇల్లిగె బందిదెను. నమ్మ నాయక ఎన్‌టీఆర్‌కు.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గౌరవ. తెలుగు – కన్నడ జనర మధ్య అన్యోన్య సంబంధ ఇదె. ఇల్లిగె బందిగె నన్ గె సంతోషాగి ఇదె' అన్నారు.(మండ్య ప్రజలకు నమస్కారం. ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. దేవెగౌడ మనువడు. సీఎం కుమారస్వామి తనయుడు. మన జాగ్వార్ నిఖిల్ తరఫున నేను ఇక్కడికి వచ్చాను. మా నాయకుడు ఎన్ టీఆర్ కు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ అంటే ఎంతో అభిమానం అని కన్నడభాషలో చంద్రబాబు మాట్లాడారు.)

చంద్రబాబునాయుడు కర్ణాటకలో పర్యటించారు. తెలుగునటి సుమలతకు వ్యతిరేకంగా మండ్య పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ – జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి తరఫున ప్రచారం చేశారు. ఈసారి ఎన్నికల్లో నిఖిల్ ను గెలిపించాలని కోరారు. ఈమేరకు మండ్య జిల్లా పాండవపురలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సభకు స్పందన రాలేదు. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. దీనికి తోడు చంద్రబాబు ఆరంభంలోనే వచ్చిరానీ కన్నడ భాషలో ప్రసంగించారు. అయితే అక్కడి ప్రజలకు అర్థం కాక కేకలు వేయడంతో అనంతరం కాసేపు ఇంగ్లిషు - మరికాసేపు తెలుగు భాషలో ప్రసంగించారు.

కేవలం బీజేపీ టార్గెట్‌గా మాట్లాడారు. మోదీని ఓడించాలని.. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండ్యతో పాటు కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ – జేడీఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ పతనమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీని గెలిపిస్తే దేశం నాశనం అవుతుందన్నారు. ప్రధాని మోదీ - బీజేపీ చీఫ్ అమిత్ షా అవినీతిపరులన్నారు. దేశవ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీని గద్దె దించాలంటే అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్రప్రభుత్వం సీబీఐ - ఐటీ సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. కర్ణాటక - పశ్చిమ బెంగాల్ - ఆంధ్రప్రదేశ్ లో మా నాయకులపై దాడులకు దిగుతోంది. నరేంద్రమోదీ అతి విశ్వాసంతో ఉన్నారు. ఈసారి ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. మోదీ కంటే మించిన శక్తి తమకు ఉందన్నారు. జీఎస్ టీ - పెద్ద నోట్ల రద్దుతో మోదీ చేసిందేమీ లేదని విమర్శించారు. పిచ్చితుగ్లక్ చర్యగా అభివర్ణించారు.