Begin typing your search above and press return to search.

బాబుకు కొత్త డౌట్‌.. ఇప్పుడే ఎందుకు వ‌స్తున్న‌ట్లు?

By:  Tupaki Desk   |   22 May 2019 11:52 AM GMT
బాబుకు కొత్త డౌట్‌.. ఇప్పుడే ఎందుకు వ‌స్తున్న‌ట్లు?
X
ఏదో ఒక ఇష్యూను భుజాల మీద పెట్టుకొని తిర‌గందే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు పొద్దు పోదా? అన్న సందేహం త‌ర‌చూ క‌లుగుతూ ఉంటుంది. దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న తీరు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌ల‌య్యాక ఆయ‌న‌కు ఈవీఎంలు.. వీవీ ప్యాట్ స్లిప్పుల మీద కొత్త సందేహాలు పెల్లుబికాయి. వాటిని స‌మాధానం చెప్పిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ మ‌రో కొత్త సందేహం.. ఇలాచెప్పుకుంటూ పోతే.. ఈసీ మీద బాబుకు వ‌చ్చిన‌న్ని సందేహాలు మ‌రెవ‌రికీ రాలేద‌ని చెప్పాలి.

ఈవీఎంల‌న్ని లెక్కించిన త‌ర్వాత‌.. చివ‌ర్లో వీవీ ప్యాట్ స్లిప్పుల్ని లెక్కించే విధానం కాకుండా.. తొలుత ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఐదు ఈవీఎంలు.. వీవీ ప్యాట్ స్లిప్పుల్ని పోల్చి చూసేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని.. ఆ త‌ర్వాతే ఓట్ల లెక్కింపు మొద‌లు పెట్టాలంటూ ఒక డిమాండ్ ను బాబు తెర మీద‌కు తీసుకురావ‌టం తెలిసిందే. దీనికి ఈసీ నో చెప్పేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో కొత్త సందేహాన్ని తెర మీద‌కు తెచ్చారు చంద్ర‌బాబు. ఒక వీవీ ప్యాట్ లో ప్రింట్ అయ్యే స్లిప్పులు 1500 మాత్ర‌మేన‌ని ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేస్తోంది. ఒక‌వేళ 1500 కు మించి ఓట‌ర్లు ఉన్న బూత్ ల‌లో అంత‌కు మించిన స్లిప్పులు న‌మోదు అయితే ప‌రిస్థితి ఏమిటి? అన్న ప్ర‌శ్న‌ను బాబు సంధిస్తున్నారు. అయితే.. ఈ సందేహం మీద ఈసీ నుంచి ఎలాంటి స‌మాధానం రాలేద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌చురించిన హ్యాండ్ బుక్ ఫ‌ర్ ఏజెంట్ అనే పుస్త‌కంలో 1500 స్లిప్పులే వీవీ ప్యాట్ లో ప్రింట్ అవుతాయ‌ని పేర్కొన్న విష‌యాన్ని బాబు ఇప్పుడు ప్ర‌స్తావిస్తున్నారు. ఒక‌వేళ‌.. ఈ సందేహాన్ని ఎన్నిక‌ల ప్ర‌క్రియ షురూ అయ్యే వేళ‌లోనే తెర మీద‌కు తెచ్చి ఉంటే బాగుండేది.

అందుకు భిన్నంగా పోలింగ్ మొద‌లు కావ‌టానికి కొన్ని గంట‌ల ముందుగా ఇలాంటి కొర్రీల‌ను చంద్ర‌బాబు తీసుకురావ‌టంలో అర్థం ఏమైనా ఉందా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. బాబుకు వ‌స్తున్న డౌట్లు చూస్తుంటే.. ఓట‌మికి ఆయ‌న మెంటల్ గా సిద్ధ‌మ‌య్యార‌ని.. అందుకే ఇలాంటి సందేహాల్ని తెర మీద‌కు తెస్తున్న‌ట్లుగా భావిస్తున్నారు. రేపొద్దున ఓట‌మి ఎదుర‌య్యాక‌.. ఓట‌మిని హుందాగా ఒప్పుకోకుండా.. తానెన్నో సందేహాల్ని తెర మీద‌కు తెచ్చినా ఒక్క‌దానికి స‌మాధానం స‌రిగా ఇవ్వ‌లేద‌న్న ఆరోప‌ణ చేసి.. సాంకేతిక అంశాల ఆధారంగా తాము ఓడిపోయిన భావ‌న క‌లిగేలా చేయ‌టంతో పాటు.. ప్ర‌జ‌ల్ని క‌న్ప్యూజ్ చేయ‌ట‌మే ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు. వామ్మో.. బాబు చిట్టి బుర్ర‌కు ఐడియాలే.. ఐడియాలు క‌దూ?