Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు టార్గెట్ జ‌గ‌నేనా?

By:  Tupaki Desk   |   30 Aug 2015 4:59 AM GMT
చంద్ర‌బాబు టార్గెట్ జ‌గ‌నేనా?
X
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు త‌న‌దైన శైలిలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ ను ఇర‌కాటంలో ప‌డేశారా? ప్ర‌భుత్వ నిర్ణ‌యం ద్వారానే జ‌గ‌న్‌ ను అడ‌కత్తెర‌లో పోక చెక్క చేసేశారా అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ‌వ‌ర్గాలు.

విజయవాడ క్యాంపు కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప‌లు అంశాల‌పై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ క్ర‌మంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అందులో ఒక‌టి అవినీతి, అక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించిన అక్రమార్కుల ఆస్తులు రాష్ట్రానికే దక్కేలా ఒక బిల్లు తేవడం. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి కసరత్తు జరుగుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఈడీ, సీబీఐ వంటి సంస్థలు జప్తు చేసిన జగన్‌ అక్రమాస్తుల కేసుల్లోని ఆస్తులు, దేశవ్యాప్తంగా వివిధ చోట్ల పట్టుబడిన ఎర్ర చందనం రాష్ట్రానికే దక్కే అవకాశం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అక్రమాలకు పాల్పడినా, ఆయా కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తుంటే కనక వాటికి సంబంధించిన ఆస్తులను కూడా అవే జప్తు చేస్తున్నాయి. ఉదాహరణకు జగన్‌పై నమోదైన కేసులకు సంబంధించిన ఆస్తులను ఈడీ జప్తు చేస్తోంది. కేసు నిరూపితమైతే ఈ ఆస్తులు ఈడీ ప‌ర‌మే అవుతాయి. రాష్ట్రం నుంచి అక్రమంగా తరలివెళ్లిన ఎర్ర చందనాన్ని ఇతర రాష్ట్రాల్లో కస్టమ్స్‌ శాఖ స్వాధీనం చేసుకొంటోంది. దానిని రాష్ట్రానికి తిరిగి ఇవ్వకుండా తన వద్దే ఉంచుకొంటోంది. అయితే, ఈ విధానాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగేలా అక్రమాలు జరిగితే.. దాని ద్వారా ఆస్తులను కూడబెట్టుకొంటే అవన్నీ రాష్ట్రానికే చెందాలని, కేంద్ర ఖజానాకు కాదన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంత దూకుడుగా సమాయత్తమవుతున్న తీరు జ‌గ‌న్‌ ను క‌ల‌వ‌ర‌పాటు క‌లిగించేదేన‌ని విశ్లేష‌కులు అంచ‌నావేస్తున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం క‌చ్చితంగా ప్ర‌జాసంక్షేమం, ప్ర‌భుత్వ ఖ‌జానాకు బ‌లం చేకూర్చేదే. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీగా జ‌గ‌న్ దీనికి త‌ప్ప‌క మ‌ద్ద‌తు ఇవ్వాలి. అయితే ఈ బిల్లు లక్ష్యం రాజ‌కీయంగా జ‌గ‌న్‌ ను ఇరుకున పెట్ట‌డ‌మే. ఈ నేప‌థ్యంలో మ‌ద్ద‌తిస్తే జ‌గ‌న్ ఆర్థికంగా దెబ్బ‌. మ‌ద్ద‌తు ఇవ్వ‌కుంటే....స‌మాజంలో జ‌గ‌న్ ప‌లుచ‌న అవుతారు. జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి మ‌రి.