Begin typing your search above and press return to search.

విభ‌జ‌నే కాదు. ప్యాకేజీ కూడా అంతే క‌దా బాబు?

By:  Tupaki Desk   |   20 Jan 2018 5:28 AM GMT
విభ‌జ‌నే కాదు. ప్యాకేజీ కూడా అంతే క‌దా బాబు?
X
ఎవ‌డి గోల వాడిద‌న్న‌ట్లుగా మారింది ఏపీ వ్య‌వ‌హారం చూస్తే. ఆంధ్రా ప్ర‌జ‌ల‌కు త‌మ ఫ్యూచ‌ర్ గురించి పెద్ద‌గా ఫీలైంది క‌నిపించ‌రు. కులం గురించి ఎవ‌రైనా ఏదైనా చిన్న తేడా మాట్లాడితే చాలు.. ర‌చ్చ ర‌చ్చ చేస్తారు. కులం మీద ప్ర‌ద‌ర్శించే అభిమానం.. ఒక రాష్ట్ర ప్ర‌జ‌లుగా.. సోద‌ర రాష్ట్రంతో పోలిస్తే దారుణ‌మైన అవ‌మానం.. అన్యాయం జ‌రిగితే ప‌ట్టించుకోవ‌టం ఎంత‌న్న‌ది చూస్తే నిజంగా విస్మ‌యానికి గురి చేస్తుంది.

ఏ రాష్ట్రమైనా.. ఏ రాష్ట్ర ప్ర‌జ‌లైనా త‌మ‌కు అన్యాయం జ‌రుగుతుంటే చూస్తూ అస్స‌లు ఊరుకోరు. ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. నిర‌స‌న నిర్వ‌హిస్తారు. ఆందోళ‌న‌లు చేస్తారు. ఆవేశానికి గుర‌వుతారు. త‌మ‌కు అన్యాయం చేస్తున్న వారిపై పోరాడేందుకు వెనుకాడ‌రు. అలాంటివేమీ ఏపీ విష‌యంలో అస్స‌లు క‌నిపించ‌వు. అక్క‌డి ప్ర‌జ‌లే కాదు.. పొలిటిక‌ల్ నేత‌ల్లో సైతం ఇలాంటి భావ‌న‌లేమీ క‌నిపించ‌వు. మ‌న‌కెంత న‌ష్టం జ‌రిగింద‌న్న భావ‌న క‌న్నా.. విభ‌జ‌న కార‌ణంగా వ్య‌క్తిగ‌తంగా త‌మ‌కు క‌లిగే లాభాల్ని చూసుకొని మురిసిపోవ‌టం క‌నిపిస్తుంది. ఇంచుమించు ఏపీలోకి కొంత మంది ప్ర‌జ‌ల్లోనూ ఈ త‌ర‌హా భావ‌న‌లు క‌లిగించ‌ట‌మే అస‌లు స‌మ‌స్య‌గా చెప్పాలి.

ఈ కార‌ణంతోనే కావొచ్చు.. విభ‌జ‌న తాలూకు న‌ష్టాల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం క‌నిపించ‌దు. త‌న‌కు నేరుగా న‌ష్టం క‌ల‌గ‌నంత వ‌ర‌కూ ప‌ట్టించుకోని తత్త్వం ఏపీ ప్ర‌జ‌ల్లో ఎక్కువ‌గా ఉంటుంద‌న్న విమ‌ర్శ‌కు త‌గ్గ‌ట్లే అక్క‌డి ప్ర‌జ‌లు.. పొలిటిషియ‌న్ల తీరు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ విష‌యాల్ని ప్రాతిప‌దిక‌గా తీసుకునే బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం తామిచ్చిన హామీల్ని కావాల‌ని విస్మ‌రిస్తుంద‌న్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

ఇప్పుడు పూసుకొని ఏపీకి ఏదైనా చేస్తే.. దాని మైలేజీ అంతా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఖాతాలోకి వెళుతుందే త‌ప్పించి.. త‌మ‌కు క‌లిగే ప్ర‌యోజ‌నం ఏమీ లేద‌న్న ఉద్దేశంతోనే కేంద్రానికి ఏపీ ప‌ట్ట‌ద‌న్న మాట వినిపిస్తుంది. ఏదైనా చేయాల‌ని నిల‌దీసే త‌త్త్వం లేనప్పుడు.. ఏ పాల‌క‌ప‌క్షం సైతం త‌మంత‌ట తాము క‌లుగ‌జేసుకొని ఏదో ఒక‌టి చేయాల‌ని అనుకోదు క‌దా.

తెలంగాణ అభివృద్ధి మీదా.. తెలంగాణ శ‌క్తి సామ‌ర్థ్యాల గురించి.. తెలంగాణ‌లో జ‌రుగుతున్న అభివృద్ధి విష‌యం మీద మాట్లాడాల్సి వ‌చ్చిన‌ప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌లు.. మిగిలిన వారికి మంట పుట్టేలా ఉండ‌ట‌మే కాదు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు చురుకు పుట్టిస్తుంటాయి. కేసీఆర్ త‌న గొప్ప‌త‌నాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే క్ర‌మంలో బాబును.. ఏపీ ప్ర‌జ‌ల్ని చిన్న‌బుచ్చేలా కేసీఆర్ మాట్లాడ‌టం క‌నిపిస్తుంది. అదేమీ త‌ప్పు కాదు. ఆయ‌న ఉన్న‌ది.. ఆయ‌న ప‌ని చేసేది.. ఆయ‌న‌కు కావాల్సింది తెలంగాణ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకోవ‌ట‌మే. అందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న నిర్ణ‌యాలు.. ఆలోచ‌న‌లు ఉంటాయి.

ఇండియా టుడే మీడియా సంస్థ నిర్వ‌హించిన కాంక్లేవ్ లో ప్ర‌త్యేకంగా మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బాబు రియాక్ట్ కావ‌ట‌మే కాదు.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీ ప్ర‌జ‌ల‌కు జ‌రిగిన న‌ష్టాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అదే స‌మ‌యంలో.. హైద‌రాబాద్ అభివృద్ధిలో త‌న కీ రోల్ ను ప్ర‌స్తావించాల‌ని త‌పించే బాబుకు మ‌రింత ఆశాభంగం క‌లిగించేలా కేసీఆర్ వ్యాఖ్య‌లు ఉండ‌టం ఆయ‌న్ను అసంతృప్తితో ర‌గిలిపోయేలా చేసింది.

దీన్లో భాగంగానే విభ‌జ‌న నాటి అన్యాయంమీద ఆవేద‌నా స్వ‌రం బాబు నోటి నుంచి వ‌చ్చేలా చేసింది. విభ‌జ‌న అన్న‌ది అంద‌రి మాట్లాడి న్యాయం చేయాల‌ని తాను కోరితే త‌న మాట‌ను ప‌ట్టించుకోలేద‌ని.. అన్యాయం జ‌రిగింద‌ని అంద‌రూ చెబుతున్నార‌ని.. న్యాయం చేయాలంటే ఆల‌స్యం చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ లో క‌ష్ట‌ప‌డి ప‌ని చేసి.. దాని అభివృద్ధికి తోడ్పాటును ఇచ్చిన త‌ర్వాత‌.. తిరిగి మ‌ళ్లీ అమ‌రావ‌తిలో క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తోంద‌న్న మాట‌ను బాబు వినిపించారు. హైద‌రాబాద్ ను తెలంగాణ‌కు ఇవ్వ‌టం వ‌ల్ల ఏపీ కోల్పోయేదాన్ని కేంద్రం స‌ర్దుబాటు చేయాలంటూ బాబు నోట డిమాండ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

వాస్త‌వానికి ఈ డిమాండ్ పై మొద‌ట్నించి మాట్లాడాల్సిన చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌స్తావించ‌టం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు. విభ‌జ‌న జ‌రిగి దాదాపుగా నాలుగేళ్లు అవుతుంది. ఈ రోజున హైద‌రాబాద్ పోయినందు వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని ఇవ్వాల‌ని కోర‌టం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం బాబు మాట్లాడార‌న్న భావ‌న క‌లిగించ‌టం మిన‌హా.. మ‌రెలాంటి లాభం ఉండ‌దు. విభ‌జ‌న స‌మ‌యంలో అంద‌రితో మాట్లాడ‌లేద‌ని మండిప‌డుతున్న చంద్ర‌బాబు.. ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా.. ప్ర‌త్యేక ప్యాకేజీని ఎవ‌రితో మాట్లాడి బాబు ఓకే చేశారో స‌మాధానం చెప్పాలి. అధికారంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా స‌రే.. త‌మ‌కు తోచిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తారే త‌ప్పించి.. అంద‌రిని క‌లుపుకుపోర‌న్నది బాబు ప్ర‌త్యేక ప్యాకేజీ టైంలో వ్య‌వ‌హ‌రించిన ధోర‌ణి చూస్తే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌త్యేక హోదాతో క‌లిగే లాభం గురించి ఏపీకి చెందిన కొంద‌రు గ‌గ్గోలు పెట్టినా ప‌ట్టించుకోకుండా ప్యాకేజీకి ఓకే అనేసిన బాబుకు విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన న‌ష్టం గురించి మాట్లాడే హ‌క్కు ఉందా? అన్న‌ది ప్రాధ‌మిక ప్ర‌శ్న‌.