Begin typing your search above and press return to search.

ఢిల్లీ వేదిక‌గా బాబు కొత్త డిమాండ్‌

By:  Tupaki Desk   |   23 April 2017 4:51 PM GMT
ఢిల్లీ వేదిక‌గా బాబు కొత్త డిమాండ్‌
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వేదిక‌గా కొత్త మాట‌ వినిపించారు. ఇప్ప‌టికే వివిధ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ల్లో ఉన్న దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలనే విధానానికి చంద్ర‌బాబు బాహాటంగా మ‌ద్ద‌తు ప‌లికారు. త‌న అధ్యక్షతన జ‌రిగిన నీతి ఆయోగ్‌ పాలకమండలి మూడో సమావేశంలో ‘ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త‌ నినాదాన్ని ఇచ్చారు. కాగా, నీతి అయోగ్ స‌మావేశానికి హాజ‌రైన అనంత‌రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకే ద‌ఫా ఎన్నిక‌ల‌కు తాము కూడా సుముఖంగా ఉన్నామని స్పష్టం చేశారు. సమస్యలు రాకుండా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే మంచిదేనని తెలిపారు. ఈ విష‌యంపై స‌వివ‌ర చ‌ర్చ జ‌ర‌గాల‌ని చంద్ర‌బాబు ఆకాంక్షించారు.

నీతి ఆయోగ్‌ సమావేశంలో తాను కన్వీనర్‌ గా స్వచ్ఛభారత్‌ పై నివేదిక ఇచ్చానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. వ్యవసాయ అభివృద్దిపై మధ్యప్రదేశ్‌ సీఎం తన నివేదిక ఇచ్చారని వివ‌రించారు. అలాగే డిజిటల్‌ ఇండియాపై నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ లో భాగంగా వ్యర్థాలతో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చంద్ర‌బాబు వివ‌రించారు. ఇప్పుడు కేంద్రం సూచించిన చాలా కార్యక్రమాలు ఏపీ ప్రభుత్వం గతంలోనే చేపట్టిందన్నారు. రాష్ట్రంలో ఇంకా 40లక్షల మరుగుదొడ్లు ఏర్పాటు కావాల్సి ఉందని చంద్ర‌బాబు తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుబంధం చేయాలని అన్ని రాష్ట్రాల్లోలాగే కోరామని ఆయ‌న తెలిపారు. ఏపీకి స్పెషల్‌ ప్యాకేజీ అమలు చేయాలని కోరామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. విశాఖకు రైల్వే జోన్‌ ఇవ్వాలని కోరినట్లు వివ‌రించారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినవి నెరవేర్చాలని కోరామన్నారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనివ్వాలని కోరామని చంద్రబాబు తెలిపారు.

వృద్దిరేటులో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ ముందుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పున‌రుద్ఘాటించారు. విభజన తర్వాత తొలి ఏడాది 5.8శాతం వృద్దిరేటు సాధించామన్నారు. తక్కువ వర్షపాతం కాలంలోనూ వ్యవసాయంలో వృద్ది సాధించామన్నారు. 3,7,15 ఏళ్ల వ్యవధితో విభిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవాలని కేంద్రం సూచించిందన్నారు. సంతోష, సమ్మిళిత వృద్దితో ముందుకు సాగాలని నిర్దేశించుకున్నామన్నారు. తలసరి ఆదాయంలో రూ.1.22 లక్షలతో ఏపీ ఐదోస్థానంలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. తలసరి ఆదాయం ఎంతకు పెరగాలనే లక్ష్యంపై ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై నివేదికలు, సూచనలిచ్చామన్నారు. ప్రభుత్వ చర్యల వల్లే వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్దిరేటు పెరిగిందన్నారు. ఒకే వైరుతో టీవీ, ఇంటర్నెట్‌, ఫోన్‌ సౌకర్యం ఇవ్వబోతున్నామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. లాండ్‌ హబ్‌కు సంబంధించి యాప్‌ రూపొందిస్తున్నామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ముందే చేపట్టిందన్నారు. డిజిటల్‌ ఇండియాతో పాటు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌కు వెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అసభ్య వార్తలు సామాజిక మాధ్యమాల్లో పెట్టకూడదని ఆయ‌న వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/