Begin typing your search above and press return to search.

మార్చేయ‌డానికే డిసైడ‌యిన బాబు

By:  Tupaki Desk   |   28 July 2015 3:24 PM GMT
మార్చేయ‌డానికే డిసైడ‌యిన బాబు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ర్టాల విభ‌జ‌న జరిగి, ఆ విభ‌జ‌న అమ‌లులోకి వ‌చ్చి ఏడాది దాటిన‌ప్ప‌టికీ ఏపీలో పాల‌న ఆ రాష్ర్ట ప‌రిధి కేంద్రంగా జ‌ర‌గ‌డం లేదు. ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజ‌ధాని సౌల‌భ్యం, రాజ‌ధాని నిర్మాణ ప్ర‌తిపాద‌న‌లు, తాత్కాలిక భ‌వ‌నాలు అందుబాటులోకి రాక‌పోవ‌డం, ఉద్యోగులు సైతం వెంట‌నే ఏపీకి వెళ్లేందుకు అయిష్ట‌త చూప‌డం వంటివి ఇందుకు కార‌ణం. అయితే ఏపీ ప్ర‌భుత్వాన్ని అక్క‌డి నుంచే న‌డిపించాల‌ని డిసైడ‌యిన చంద్ర‌బాబు ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ హెచ్ ఓడీలను నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి త్వ‌ర‌లో తరలించనున్నారు. ఏపీ ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కూడి కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌యిన‌ లవ్ అగర్వాల్, శ్యాంబాబు, జయలక్ష్మి, హేమ ముని వెంకటప్ప సభ్యులుగా వేసింది. విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన నేప‌థ్యంలో ఈ మేర‌కు ఆదేశాలు వెలువ‌రించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు అయిన సీహెచ్. అయ్యన్నపాత్రుడు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమై కార్యాలయాల తరలింపు, రుణ మాఫీ అంశాలపై చర్చించారు. అనంత‌రం ఈ ఆదేశాలు వెలువ‌రించారు.