Begin typing your search above and press return to search.

వైసీపీని కొత్త‌గా భ‌య‌పెడ్తున్న బాబు

By:  Tupaki Desk   |   25 May 2016 10:17 AM GMT
వైసీపీని కొత్త‌గా భ‌య‌పెడ్తున్న బాబు
X
రాజ్యసభ ఎన్నికల్లో నాల్గవ స్థానాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్న తెలుగుదేశం పార్టీ అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల బల, బలాల ఆధారంగా అధికార టీడీపీకి మూడు, వైస్సార్సీపీకి ఒక్క స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎలాగైన నాలుగొవ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్న టీడీపీ నాయకత్వం, భారీ ఎత్తున వైస్సార్సీపీ ఎమ్మెల్యేలను క్రాస్ ఓటింగ్ ప్రోత్సాహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైస్సార్సీపీకి చెందిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేలను క్రాస్ ఓటింగ్ పాల్పడే విధంగా పథకరచన చేస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను పార్టీ తరుపు నాల్గవ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్న వారికి అప్ప‌గించనున్న‌ట్లు తెలుస్తోంది.

జూన్ 11న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో నాల్గవ స్థానాన్ని కూడా గెల్చుకోవాలని ఆశిస్తున్న తెలుగుదేశం పార్టీకి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. అయితే ప్రస్తుతం వైస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన 17 మంది ఎమ్మెల్యేలతో కలుపుకుని 125 మంది శాసనసభ్యుల బలమున్నప్పటికీ, మరో 19 మంది శాసనసభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. అయితే త్వరలోనే మరో డజన్ మంది వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమై 12 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన, మరో 13 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుందని చెబుతు న్నాయి. అయితే ఇక్కడే టీడీపీ నాయకత్వం తమ బుర్రకు పదును పెట్టింది. నాల్గవస్థానాన్ని గెల్చుకునేందుకు 15 మంది ఎమ్మెల్యేలను క్రాస్ ఓటింగ్ పాల్పడే విధంగా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వైస్సార్సీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ పాల్పడే విధంగా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నానని, పార్టీ తరుపున నాల్గవ అభ్యర్థికి పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరు, పార్టీ నాయకత్వానికి చెప్పినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి ఓటు వేసే విధంగా ప్రతి పార్టీ విప్ జారీ చేస్తుంది. ఒకవేళ ఎవరైన విప్ ధిక్కరించి క్రాస్ ఓటింగ్‌ కు పాల్పడితే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. ఇక్కడే వైస్సార్సీపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసేందుకు ఎందుకు సాహసిస్తారన్న ప్రశ్న తలెత్తకమానదు. అయితే క్రాస్ ఓటింగ్‌ కు పాల్పడే ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో ముట్టచెప్పే విధంగా సదరు పారిశ్రామికవేత్త మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఒకవేళ అనర్హత వేటు పడి, ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కూడా ఎన్నికలకయ్యే ఖర్చంత తానే భరిస్తానని ఆయన హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రాజ్య‌స‌భ‌ నాలుగో స్థానం కోసం భ‌లే ఉత్కంఠ‌ను రేకెత్తిస్తోంది.