Begin typing your search above and press return to search.

బాబు హైప్‌ తో త‌మ్ముళ్ల బీపీ పెరుగుతోంది

By:  Tupaki Desk   |   27 Feb 2017 6:22 AM GMT
బాబు హైప్‌ తో త‌మ్ముళ్ల బీపీ పెరుగుతోంది
X
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక ల‌క్ష‌ణ‌మైన చివ‌రి నిమిషం వ‌ర‌కు తేల్చ‌క‌పోవ‌డం ఆ పార్టీ నేత‌ల‌కు రుచించ‌డం లేద‌ని అంటున్నారు. అభ్య‌ర్థులు ఎవ‌ర‌నే విష‌యంలో క్లారిటీ ఇవ్వ‌కుండా పెంచుతున్న హైప్ - అన‌వ‌స‌ర స‌స్పెన్స్ ఇబ్బందిక‌రంగా ఉందంటున్నారు. త‌మ్ముళ్ల‌కు చెందిన ఈ ఆవేద‌న‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల గురించి. నిజానికి ఆదివారం అర్ధరాత్రికయినా అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే అదేమీ లేక‌పోవ‌డంతో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ పెరుగుతోంది. మరికొన్ని గంటల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్న నేపథ్యంలో ఆశావహులు పార్టీ అధినేత - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ - పొలిట్‌ బ్యూరో సభ్యులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. సోమవారం మంచిరోజు అయినందున ఉదయం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సోమవారం మధ్యాహ్నమే నామినేషన్లు వేస్తారంటున్నారు.

ఎమ్మెల్యేల కోటా - గవర్నర్ నామినేటెడ్ ద్వారా తెలుగుదేశం పార్టీకి 7 ఎమ్మెల్సీ సీట్లు దక్కనున్నాయి. ఈ క్రమంలో కమ్మ వర్గంలో పోటీ తీవ్రంగా ఉంది. ప్రకాశం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం - పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముళ్లపూడి రేణుక - చిత్తూరు జిల్లా నుంచి దొరబాబు - అనంతపురం నుంచి సుబ్రమణ్యం ప్రయత్నిస్తున్నారు. అదే సామాజిక వర్గం నుంచి లోకేష్‌కు ఈపాటికే టికెట్ ఖరారయిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లా సీనియర్ నేత, తనకు చిరకాల మిత్రుడైన కరణం బలరామ్‌ ను ప్రత్యేకించి పిలిపించుకున్న బాబు - ఎమ్మెల్సీ సీటు ఇస్తానని, జిల్లాలో పార్టీని పటిష్ఠం చేసే బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. గత మూడునెలల నుంచి ఎడముఖం, పెడముఖంగా ఉంటున్న చంద్రబాబు - కరణం ఇటీవలే తొలిసారి మాట్లాడుకున్నారని, మంత్రి శిద్దా రాఘవరావు రాయబారం నడిపి కరణంను వెంటబెట్టుకుని బాబు వద్దకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఒకవేళ బలరామ్‌ కు ఇస్తే కమ్మ వర్గంలోని ఇక మిగిలిన వారికి స్థానం దక్కకపోవచ్చు. బీసీల నుంచి శ్రీకాళం జిల్లా తూర్పుకాపు వర్గానికి చెందిన అప్పలనాయుడుకు సీటు దక్కవచ్చంటున్నారు.

ఇక దళిత సామాజిక వర్గంలో కూడా పోటీ పెరుగుతోంది. గత ఎన్నికల్లో సాంకేతిక సమస్యలొచ్చి అవకాశం కోల్పోయిన మాల వర్గానికి చెందిన జూపూడి ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూ పదవీ విరమణ చేయనున్న ప్రతిభాభారతి కూడా రెన్యువల్ కోరుతున్నారు. ఆమెకు ఇస్తే జూపూడి అవకాశాలు దెబ్బతినవచ్చంటున్నారు. ప్రస్తుతం జూపూడి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌ గా పనిచేస్తున్నారు. వచ్చే మంత్రివర్గ విస్తరణలో మాదిగ వర్గానికి చెందిన మంత్రి రావెల కిశోర్‌ బాబును తొలగించడం ఖాయం కావడంతో, ప్రత్యామ్నాయంగా ఆ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు అవకాశం దక్కవచ్చంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పామర్రు నుంచి పోటీచేసే అవకాశం లేనందున ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వవచ్చంటున్నారు. అదే వర్గానికి చెందిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటికే రాయపాటి వర్గానికి ఎక్కువ అవకాశాలివ్వడంపై జిల్లాలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత - మాజీ మంత్రి పుష్పరాజ్‌ కు ప్రతిసారి అన్యాయం జరుగుతున్నందున ఈసారి ఆయనకు తప్పకుండా ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పుష్పరాజ్‌కు న్యాయం చేస్తానని బాబు హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకూ నెరవేర్చకలేకపోయారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/