గంటా అలకను బాబు అలా తీర్చారట!

Thu Jun 21 2018 12:17:06 GMT+0530 (IST)

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నింటికి మించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన మంత్రివర్గంలోని మంత్రులు చుక్కులు చూపిస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గడిచిన వారం రోజులుగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అలకలో ఉండటం.. ముఖ్యమంత్రిపై గుర్రుగా ఉన్న ఆయన ముభావంగా ఉంటూ ఆయనపై అలక జెండా ఎగురవేయటం హాట్ టాపిక్ గా మారింది.మంత్రివర్గ సమావేశానికి డుమ్మ కొట్టి  అధినేతకు షాకిచ్చిన గంటా.. తన అలకను మరింత పెంచేందుకు సిద్ధమయ్యారన్న వార్తల జోరు పెరిగింది. ఆయన అలక ఎంతవరకూ వెళ్లిందంటే.. అధినేత తన ప్రాంతంలో పర్యటిస్తున్నా.. కార్యక్రమంలో పాల్గొనేందుకు సంసిద్ధంగా లేనంతవరకూ విషయం వెళ్లింది. ఒకవేళ.. అదే జరిగితే గంటా కంటే ఎక్కువ డ్యామేజ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కావటం ఖాయం. అందుకే.. గంటా అలక తీర్చి.. బుజ్జగించేందుకు ఏకంగా హోంమంత్రినే రాయబారంగా పంపారు.

గంటా నివాసానికి వెళ్లిన ఏపీ హోంమంత్రి చినరాజప్ప గంటాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధినేత సందేశాన్ని చెప్పటంతో పాటు.. బాబు చేత మాట్లాడించినట్లుగా చెబుతున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిలో ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారంటూ వచ్చిన సర్వే వివరాలపై గుర్రుగా ఉన్నారు. దీనిపై రియాక్ట్ అయిన చంద్రబాబు.. సర్వే రిపోర్టులను సీరియస్ గా తీసుకోవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది.

రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేక విషయాలు దగ్గరకు వస్తుంటాయని.. వాటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న బాబు.. రోజూ తన మీదా చాలానే వార్తలు వస్తుంటాయని.. వాటిని ఫీడ్ బ్యాక్ గా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చినప్పుడు.. వాటిని మార్చేలా నిర్ణయాలు తీసుకోవాలే తప్పించి.. ముభావంగా ఉంటే ప్రయోజనం ఉండదన్న విషయాన్ని బాబు చెప్పినట్లుగా తెలుస్తోంది.

రాజకీయాల్లో సలహాలు.. సూచనలన్నీ తీసుకోవాలని.. టీం వర్క్ తో పని చేయాలని గంటాకు ఉపదేశాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. సీఎం ప్రత్యేకంగా ఫోన్ మాట్లాడటంతో పాటు.. చినరాజప్ప రాజీ ప్రయత్నాలు ఫలించినట్లుగా తెలుస్తోంది. బాబు విశాఖ పర్యటన సందర్భంగా తాను కచ్ఛితంగా హాజరవుతానన్న హామీని గంటా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో.. బాబు అండ్ కో కొంతమేర రిలాక్స్ అయినట్లుగా తెలుస్తోంది.