Begin typing your search above and press return to search.

నిర్మ‌ల రాజ్య‌స‌భ సీటుకు బాబు కండీష‌న్లు

By:  Tupaki Desk   |   25 May 2016 1:57 PM GMT
నిర్మ‌ల రాజ్య‌స‌భ సీటుకు బాబు కండీష‌న్లు
X
బీజేపీ విష‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారా? ప్ర‌త్యేక‌హోదా ఇవ్వ‌లేమ‌ని చెప్పేసిన పార్టీ నేత‌ల‌పై ఒత్తిడి తీసుకురావాల‌ని నిర్ణ‌యించుకున్నారా? ఇందుకు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌ను ఉప‌యోగించుకోబోతున్నారా? `మాకు ఫ‌లానా ప‌ద‌వి ఇస్తేనే మీకు ఈ ప‌ద‌వి ఇస్తాం. లేక‌పోతే క‌ష్టం` అని నిక్క‌చ్చిగా చెప్పబోతున్నారా? బీజేపీకి కండీష‌న్లు పెట్ట‌బోతున్నారా అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

గ‌తంలో అన్నివిష‌యాల్లో కఠినంగా వ్య‌వ‌హ‌రించే చంద్ర‌బాబు.. ఇప్పుడు మెత‌క‌వైఖ‌రి అవ‌లంబిస్తున్నారు. ప‌రిస్థితులు ఆయన్ను అలా మార్చేశాయి మ‌రి. ఆర్థికంగా అవ‌స్థ‌లు ప‌డుతున్న రాష్ట్రం.. కేంద్రం అండ‌దండ‌లు లేక‌పోతే ఇంకా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని గ్ర‌హించిన బాబు.. అందుకు అనుగుణంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఇక కేంద్రం ప‌ట్ల‌ క‌ఠినంగా ఉండాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఏపీ త‌ర‌ఫున బీజేపీ కోటాలో ఉన్న ఎంపికై కేంద్ర మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ను టీడీపీ కోటాలో మరోసారి రాజ్యసభకు పంపుతారా? లేదా? అన్న సస్పెన్స్ ఇంకా కొన‌సాగుతోంది. ఒకవేళ నిర్మలా సీతారామన్ కు రాజ్యసభ సీటు కేటాయించాల‌ని కేంద్రం కోరితే... తాము ప్ర‌తిగా ఏం అడగాలనే దానిపై చంద్రబాబు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

తమ పార్టీ నుంచి రాజ్యసభ సీటు ఇస్తే... తమకు కేంద్రంలో నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని బీజేపీ ముందు టీడీపీ అధినేత ప్రతిపాదనలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అమిత్ షా - చంద్రబాబు మధ్య చర్చ జరగొచ్చట‌. కేంద్రంలోని పలు నామినేటెడ్ పోస్టులతో పాటు తమ పార్టీకి చెందిన ఓ వ్యక్తికి గవర్నర్ గా అవకాశం కల్పించాలని చంద్రబాబు కోరబోతున్నట్టు స‌మాచారం. తమ ప్రతిపాదనలకు బీజేపీ ఒప్పుకుంటే మంచిదని... లేకపోతే ఆ పార్టీకి రాజ్యసభ సీటు ఇవ్వడానికి వీల్లేదని కొందరు నాయకులు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం.