Begin typing your search above and press return to search.

బాబులో వైఎస్‌ మీద ప్రేమా? సరికొత్త వ్యూహమా?

By:  Tupaki Desk   |   26 Aug 2016 12:37 PM GMT
బాబులో వైఎస్‌ మీద ప్రేమా? సరికొత్త వ్యూహమా?
X
చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ ను అడ్డుపెట్టుకుని - ఎవరికి తోచినట్లుగా వారు రాష్ట్రాన్ని దోచుకున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక కోణంలోంచి చూసినప్పుడు.. ఈ వ్యాఖ్యలకు అర్థం.. దోచుకోవడంతో వైఎస్సార్‌ కు ప్రత్యక్షంగా సంబంధం లేదు గానీ.. ఆయనను అడ్డుపెట్టుకుని చాలా మంది దోచుకున్నారని అన్నట్లుగా ఉంది. ఇది జగన్‌ మీద చంద్రబాబు వెలిగక్కుతున్న కడుపుమంట కావచ్చు. కానీ అందుకోసం వైఎస్సార్‌ కు అనుకూలంగా ఉండే మాటలను ఆయన నోటితో పలకగలుగుతున్నారంటే ఆశ్చర్యమే మరి!

అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ రాష్ట్రంలో ఎన్‌ టి రామారావు తర్వాత.. అంత స్థాయిలో ప్రజాదరణ ఉన్న ఏకైక నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే అనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహమూ లేదు. అలాంటిది అప్పట్లో రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రామారావుకు దానితో సంబంధం లేదని అంటూ.. తెలుగుదేశం పార్టీని తాను లాక్కున్నారు. అయితే ఆ తర్వాత ప్రజల్లో రామారావుకు ఉన్న ఖ్యాతికి, కీర్తికి మాత్రం తానే వారసుడిని అన్నట్లుగా ఇప్పటిదాకా చెలామణీ అయిపోతున్నారు.

అలాగే.. తాను ఎన్ని మాటలు అన్నా సరే.. ప్రజల గుండెల్లో వైఎస్సార్‌ కు ఉన్న స్థానాన్ని చెరపడం సాధ్యం కాదని బహుశా చంద్రబాబు డేష్‌ బోర్డులో ఒక ప్రజాభిప్రాయం వచ్చి ఉంటుంది. వైఎస్సార్‌ మీద బురద చల్లే బదులు - ఇప్పటికీ శత్రువులుగా ఉన్న ఆయన వారసులంతా అసలు నేరస్తులు అనే ప్రచారం చేస్తే.. అటు వైఎస్‌ ఆర్‌ అభిమానుల వద్ద కూడా తాను మార్కులు కొట్టేయవచ్చునని చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేస్తున్నారా అనిపిస్తోంది. మరికొన్ని రోజులు వైఎస్సార్‌ గురించి ఇలాగే పాజిటివ్‌ గా మాట్లాడి, ఆయనకు జనంలో ఉన్న ఆదరణకు మంచి పేరుకు మాత్రం తనకు వారసత్వం కావాలని, ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు - విమర్శలకు మాత్రం జగన్‌ ను పూచీ చేయాలని చంద్రబాబు ప్లాన్‌ చేసినా ఆశ్చర్యం లేదని జనం నవ్వుకుంటున్నారు.