Begin typing your search above and press return to search.

పండ‌గ‌పూట పాత ఫ్రెండ్ ను ఏసుకున్న బాబు

By:  Tupaki Desk   |   18 March 2018 10:50 AM GMT
పండ‌గ‌పూట పాత ఫ్రెండ్ ను ఏసుకున్న బాబు
X
మిగిలిన రోజులు ఎలా ఉన్నా.. ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నా పండ‌గ వ‌చ్చిందంటే ఉన్న క‌ష్టాల్ని.. బాధ‌ల్ని కాసేపు ప‌క్క‌న పెట్టి..పండ‌గ‌ను చేతనైనంత బాగా చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాం. ఇందులో భాగంగా రోటీన్ కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తాం. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం ఆ తీరులో ఉండ‌క‌పోవ‌టం క‌నిపిస్తోంది.

కేంద్రంతో క‌టీఫ్ చెప్పేసి.. మోడీ స‌ర్కారుపై యుద్ధం చేస్తున్న చంద్ర‌బాబు.. ఆ విష‌యానికి తానెంత ప్రాధాన్య‌త ఇస్తున్నాన‌న్న విష‌యాన్ని తాజాగా ఆయ‌న ప్ర‌సంగాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. తెలుగోళ్ల‌కు కొత్త సంవ‌త్స‌ర‌మైన ఉగాది సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌కు చంద్ర‌బాబు హాజ‌ర‌య్యారు.

పండుగ వేళ‌.. నాలుగు మంచి మాట‌లు చెప్పే క‌న్నా.. మిత్రుడిగా ఉన్న మోడీ రాష్ట్రానికి ఎంత మోసం చేశార‌న్న విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇచ్చిన హామీల్ని నెర‌వేర్చే విష‌యంలో వారు న‌మ్మ‌క‌ద్రోహం లాంటిది చేసిన‌ట్లుగా ఆరోపించారు. మోడీ స‌ర్కారు తీరును తాను భ‌రించ‌లేక‌పోయిన‌ట్లుగా చెప్పిన చంద్ర‌బాబు.. న‌మ్ముకున్నోళ్ల‌ను మోసం చేయ‌టం మంచిది కాద‌న్న మాట‌ను చెప్పుకొచ్చారు. అంతేనా.. మిత్ర‌ప‌క్షంగా ఉన్న స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం తానెంత త‌పించింది చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు.

పండ‌గ ముచ్చ‌ట్ల‌ను ప‌క్క‌న పెట్టేసి.. పాత ఫ్రెండ్ చేసిన త‌ప్పుల్ని ఏక‌రువు పెట్టారు. త‌ద్వారా.. మోడీతో క‌టీఫ్ కు అవ‌స‌ర‌మైన గ్రౌండ్ ను బాబు సిద్ధం చేశార‌ని చెప్పాలి. ఎన్నిక‌ల వేళ‌లో ఇచ్చిన హామీల్ని అమ‌లు చేయాలంటూ కేంద్రాన్ని కోరార‌ని.. సీనియ‌ర్ గా ఉండి భేష‌జాల‌కు పోకుండా రాష్ట్రానికి న్యాయం చేయాల‌ని కేంద్రాన్ని చాలాసార్లు కృషి చేసిన విష‌యాన్ని చెప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా బాబు నోటి నుంచి వ‌చ్చిన ఆణిముత్యాల్లాంటి మాట‌లు చూస్తే..
విభ‌జ‌న కార‌ణంగా జ‌రిగిన నష్టానికి న్యాయం చేయాలంటూ తాను కేంద్రాన్ని కోరాన‌ని.. అందుకు ప్ర‌తిగా కేంద్రంలోని బీజేపీ త‌మ‌తో యుద్ధం చేస్తాన‌ని వ్యాఖ్యానించ‌టంలో న్యాయం ఎంత‌ని ప్ర‌శ్నించారు. ఇంత‌కూ ఎవ‌రి మీద యుద్ధం చేస్తారు? తెలుగుజాతి మీదా? అంటూ ప్ర‌శ్నించారు.

ఏది లేకున్నా ఫ‌ర్లేదు కానీ ఆత్మ‌గౌర‌వాన్ని మాత్రం చంపుకోలేన‌న్న చంద్ర‌బాబు.. ఉద్వేగంగా మాట్లాడుతూ అడిగిన హామీల్ని నెర‌వేర్చాల‌ని అడిగితే యుద్ధం రాలేదు కాబ‌ట్టి ర‌క్ష‌ణ శాఖ నిధులు కూడా అడుగుతారంటూ కొంద‌రు హేళ‌న చేయటాన్ని ప్ర‌స్తావించారు. మ‌నం రక్ష‌ణ శాఖ నిధుల్ని అడుగుతామా? అంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. ఎన్టీఆర్ తెలుగువారికి ఆత్మ‌గౌర‌వాన్ని ఇస్తే.. తాను రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ప్ర‌జ‌ల‌కు ఆత్మ‌విశ్వాసాన్ని అందించిన‌ట్లుగా చెప్పుకున్నారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోర‌టం లేద‌ని.. విభ‌జ‌న వేళ రాజ్య‌స‌భ‌లో ఏమైతే చెప్పారో వాటిని మాత్ర‌మే అడుగుతున్నామో కానీ.. ఇంకేమీ అడ‌గ‌టం లేద‌న్నారు. పండ‌గ‌పూట కూడా క‌మ‌ల‌నాథుల‌పై విమ‌ర్శ‌ల జోరును బాబు కించిత్ కూడా త‌గ్గించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.