బాబు లక్ష్మణ రేఖ దాటేస్తున్నారా?

Thu Jun 07 2018 10:23:03 GMT+0530 (IST)

నిజమే..రాజకీయంగా లెక్కలు తేడా వచ్చినప్పుడు వ్యవహారం వేరుగా ఉంటుంది. అప్పటివరకూ నవ్వులు చిందించిన వారంతా నిప్పులు చెరుగుతుంటారు. అదేం తప్పు కాదు. కానీ.. ఆ పేరుతో అవసరం ఉన్నా.. లేకున్నా అదే పనిగా విమర్శనాస్త్రాల్ని సంధించటం అంత మంచిది కాదు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు చూస్తే.. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.నాలుగేళ్ల ఫ్రెండ్ షిఫ్ లో పల్లెత్తు మాట అనేందుకు సైతం వెనుకాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు తనకేమీ భయం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది మంచిదే అయినప్పటికీ.. ఆయన విమర్శలు ఈ మధ్యన శృతి మించినట్లుగా కనిపిస్తోంది. అవసరం ఉన్నా.. లేకున్నా.. ఏదోలా మోడీషాలను కెలకటమే తన లక్ష్యమన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. రాజకీయ దూషణలు కాస్తా.. వ్యక్తిగత స్థాయికి పడిపోవటం చూసినప్పుడు బాబు అనవసరంగా కెలుకుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గడిచిన కొంతకాలంగా తనకు ఎదురు లేదన్నట్లుగా ఫీలైన మోడీ.. పార్టీలో తన వర్గాన్ని తప్ప మిగిలిన వారిని పట్టించుకోవటం మానేశారు. ఇక.. బీజేపీ సీనియర్ నేతల మాటల్ని వినేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. ఆ మాటకు వస్తే.. వారిని చూసేందుకే కాదు.. కలిసేందుకు సైతం ఇష్టపడటం లేదు.

ఆ మధ్యన బీజేపీ పెద్దాయన అద్వానీ ముకుళిత హస్తాలతో నమస్కారం చేస్తే.. ఆ వైపు చూసేందుకు సైతం మోడీ ఆసక్తి చూపించకపోవటం అప్పట్లో సంచలనంగా మారింది. అదెంతగా మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్టీకి భారీగా ఎదురుదెబ్బ తగలటంతో మోడీషాలు కిందకు దిగివచ్చినట్లుగా చెబుతున్నారు. అప్పటివరకూ అందరిని కలుపుకు వెళ్లే విషయంలో తమ సొంత ఎజెండా ఫాలో అవుతున్న మోడీ.. తన ప్లాన్ ను మార్చేసినట్లుగా కనిపిస్తోంది. ఇంతకాలం పెద్దగా పట్టని బీజేపీ పెద్దల్ని ఇప్పుడు పట్టించుకోవటమే కాదు.. వారితో సమావేశమవుతున్నారు.

ఈ అంశం పూర్తిగా బీజేపీ అంతర్గత విషయంగా చెప్పాలి. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి ఇలాంటి విషయాల్ని కూడా తన వ్యాఖ్యల్లో ప్రస్తావిస్తున్నారు. మొన్నటివరకూ ఆకాశంలో విహరించిన మోడీ.. ఉప ఎన్నికల ఫలితాలతో నేలకు దిగి వచ్చారని బాబు మండిపడుతున్నారు. ఉప ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా భయపడిన మోడీ.. అద్వానీ.. జోషీ లాంటి సీనియర్ల వద్దకు వెళ్లి అడుక్కునే పరిస్థితికి వచ్చినట్లుగా పేర్కొన్నారు. ప్రత్యర్థుల మీద కోపం ఉండటం మామూలే కానీ.. మాటల్ని కాస్తంత మృదువుగా ఉపయోగిస్తే సరి.

అందుకు భిన్నంగా మోడీ మాష్టారు లాంటి నేతకు ఎక్కడో కాలేలా మాటలు ఉంటే.. ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులోనూ అందుకు తగ్గ ఫలితం అనుభవించాల్సి ఉంటుందన్న నిజాన్ని బాబు గుర్తిస్తే మంచిదంటున్నారు. సున్నితమైన అంశాల్ని టచ్ చేసేటప్పుడు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలే కానీ.. బజారున పడ్డట్లుగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందన్నది మర్చిపోకూడదు. ఇక.. తాను కేంద్రం మీద చేస్తున్న అలుపెరగని ధర్మ పోరాటం మొత్తం భవిష్యత్ తరాల కోసమేనని వ్యాఖ్యానిస్తున్నారు. మరి..భవిష్యత్ తరాల కోసం అంతగా ఆరాటపడే బాబు.. రాష్ట్ర విభజన వేళ ఏం చేసినట్లు..?