Begin typing your search above and press return to search.

2 వేల నోటును రద్దు చేయాలంటున్న బాబు

By:  Tupaki Desk   |   26 Sep 2017 3:48 PM GMT
2 వేల నోటును రద్దు చేయాలంటున్న బాబు
X
పెద్ద నోట్ల ర‌ద్దు...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ హ‌యాంలో జ‌రిగిన భారీ సంస్క‌ర‌ణ.ఈ చ‌ర్య త‌న‌కు ఎంతో మైలేజ్ ఇస్తుంద‌ని కాషాయ ద‌ళ‌ప‌తి క‌ల‌లు క‌న్నారు. అయితే దానికి మిశ్ర‌మ స్పంద‌న ఇంకా చెప్పాలంటే...ప్ర‌జ‌ల నుంచి నిరాశే ఎదురైంద‌నేది విశ్లేష‌కుల మాట‌. అయితే తాజాగా ఈ ఎపిసోడ్‌ పై ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ చేశారు. ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్ర‌బాబు ఓ ఇంగ్లీష్ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస‌క్తిక‌ర‌మైన విషయాన్ని వెల్లడించారు. రెండు వేల నోట్లను రద్దు చేయాలని గ‌తంలోనే ప్ర‌స్తావించిన ఆయన తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నోట్ల రద్దు తర్వాత రెండు వేల నోటును ప్రవేశపెట్టి ప్రధాని నరేంద్ర మోడీ తప్పు చేశారా అని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ప‌రోక్షంగా స్పందించారు. నోట్ల రద్దు ప్రకటించనప్పుడు భారీ స్థాయిలో వ్యవస్థ నుంచి డబ్బు వెళ్లిపోయిందని, అందుకే ఆ సమయంలో రెండు వేల నోటు అవసరమైందని - ఒకవేళ 2 వేల నోటును ప్రింట్ చేయకుంటే ఆ స్థాయిలో లోటును పూడ్చేవాళ్లం కాదన్నారు. కానీ ఇప్పుడు రెండు వేల నోటును రద్దు చేస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏదైనా సంస్కరణ చేపడితే.. దాని ఫలితాలు రావాలంటే కొంత సమయం పడుతుందని, పెద్ద డినామినేషన్ నోట్లు సహజంగానే సమస్యలు సృష్టిస్తాయని - ఆ నోట్ల వల్ల అవినీతి కూడా ఎక్కువవుతుందని - దాన్ని నేను గట్టిగా నమ్ముతానని చంద్రబాబు అన్నారు. రాజకీయ క్షేత్రంలోనూ రెండు వేల నోటు వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. డిజిటల్ కరెన్సీని ఎక్కువగా ప్రమోట్ చేయడం వల్ల కొంత వరకు సమస్యను అదుపు చేయవచ్చని చంద్ర‌బాబు విశ్లేషించారు.

కాగా, ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. జీఎస్టీ గురించి ఆయనతో చర్చించారు. కొత్త పన్ను విధానం వల్ల సమస్యలు వస్తున్నట్లు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా జీఎస్టీ కిందకు రావడం శోచనీయమన్నారు. కొన్ని రంగాలకు జీఎస్టీ మినహాయింపు కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.