Begin typing your search above and press return to search.

బస్సుజర్నీలో దిమ్మ తిరిగేలా బాబు క్లాస్

By:  Tupaki Desk   |   20 Sep 2016 11:30 AM GMT
బస్సుజర్నీలో దిమ్మ తిరిగేలా బాబు క్లాస్
X
ఇటీవల జరిగిన ఒక ఘటన అధికార వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా విషయాన్ని పట్టుకుంటే దాని అంతు చూసే వరకూ వదిలిపెట్టని రీతిలో వ్యవహరించే తత్వం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందన్న విషయం తెలిసిందే. దీనివల్ల కొన్నిసార్లు ఎంత లాభమో.. మరికొన్ని సార్లు అంతే నష్టం కలుగుతున్న పరిస్థితి. మొన్నటివరకూ ప్రత్యేక హోదా మీద ఉన్న కొద్దిపాటి ఆశలు కూడా వమ్ము కావటం.. కేంద్రం ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్ని నయాపైసలతో సహా కేంద్రమే ఖర్చు భరిస్తుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈ భారీ ప్రాజెక్టుకు నిధుల కొరత అంటూ లేని పరిస్థితి. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుకు సంబంధించిన నిధుల్ని నాబార్డు సమకూరుస్తుంది. దీన్ని.. కేంద్రం తీర్చేలా ఒక ఏర్పాటు చేశారు. దీంతో.. పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు ఖర్చు లేకుండా కామ్ గా ఉన్న చంద్రబాబులో ఒక్కసారి ఉత్సాహం ఉప్పొగింది. రికార్డు సమయంలో.. సరికొత్త రికార్డు సృష్టించేలా పోలవరం లాంటి భారీ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే వచ్చే మైలేజీ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకాలం వేధించిన నిధుల సమస్య కూడా తీరిపోవటంతో.. జైట్లీ ప్రకటన వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు బాబు వెళ్లారు.

ఇక్కడే ఆసక్తికర ఘటన ఒకటి చేరుకుంది. పోలవరం పనుల్ని సమీక్షించి తిరిగి హెలికాఫ్టర్ లో ప్రయాణమయ్యేందుకు సిద్ధమవుతున్న వేళ.. జోరున వర్షం పడటంతో.. హెలికాఫ్టర్ ప్రయాణానికి అదికారులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో.. బాబు బస్సు మార్గంలో విజయవాడకు చేరుకోవాలని డిసైడ్ అయ్యారు. అప్పుడే ఆయనకు వచ్చిన కొత్త ఆలోచనతో.. అప్పటికప్పుడు తనతో పాటు.. ఇరిగేషన్ మంత్రితో పాటు.. కీలక ఇరిగేషన్ అధికారుల్ని తన బస్సులో ఎక్కించుకున్న చంద్రబాబు.. రివ్యూను అప్పటికప్పుడు ఏర్పాటు చేశారట.

బస్సు ప్రయాణం షురూ అయిన మొదలు పోలవరం ప్రాజెక్టును ఎప్పటి లోపు పూర్తి చేస్తారని ప్రశ్నించిన చంద్రబాబు.. ప్రాజెక్టు పనులకు సంబందించి ఇప్పుడున్న పెండింగ్ పనుల్ని ప్రస్తావించటం.. వాటిని పూర్తి చేసే సమయం ఎంతన్న విషయంపై డీటైల్డ్ గా మాట్లాడటం అధికారులకు ఒక షాక్ అయితే.. ఏ మాత్రం టైం ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టును ఎప్పటిలోపు పూర్తి చేయగలరన్న కమిట్ మెంట్ తనకు ఇవ్వాలని అధికారుల్ని కోరటంతో వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారట.

బస్సులో సీటు కదలకుండా.. తర్జనభర్జనల అనంతరం 2018 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన అధికారుల మాటలతో బాబు సీరియస్ అయ్యారని చెబుతున్నారు. అంత సమయం ఎందుకన్న ప్రశ్నతో పాటు.. ఎంత త్వరగా పూర్తి చేయొచ్చో తెలుసా? అంటూ ఒక్కొక్కటిగా లెక్కలు చెప్పిన చంద్రబాబు.. చివరకు 500 రోజుల్లో ప్రాజెక్టు తొలిదశను పూర్తి చేయాలని డిసైడ్ చేయటం అధికారులకు షాకింగ్ గా మారిందని చెబుతున్నారు. పోలవరం మీద చంద్రబాబుకు ఉన్న అవగాహనతో పాటు.. అధికారులు పరుగులు పెట్టేలా కాల వ్యవధిని నిర్ణయించటంతో పాటు.. తాను చెప్పిన గడువు లోపు ఎట్టిపరిస్థితుల్లోనూ పనులుపూర్తి కావాలని చెప్పటమే కాదు.. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు మీద రివ్యూ ఏర్పాటు చేసి.. పనుల మీద ఆరా తీయనున్నట్లుగా చెప్పారు. తాను చెప్పినట్లే.. చంద్రబాబు నిన్న (సోమవారం) పోలవరం మీద రివ్యూ ఏర్పాటు చేసి.. అధికారుల్న ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి నుంచి బస్సులో స్టార్ట్ అయిన మీటింగ్ పూర్తి అయ్యేసరికి బెజవాడకు చేరుకుందని.. మూడున్నర గంటలు పాటు సాగిన పోలవరం మీటింగ్ తమ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమని సీనియర్ అధికారులు ఒకరిద్దరు లోగుట్టుగా వ్యాఖ్యానించటం గమనార్హం. మొత్తంగా.. బస్సు జర్నీలోనూ అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టిన బాబు వైఖరిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.