Begin typing your search above and press return to search.

మోడీతో పెట్టుకోకూదన్న తెలివి ఇప్పుడు వచ్చిందా బాబు?

By:  Tupaki Desk   |   12 Oct 2019 5:25 AM GMT
మోడీతో పెట్టుకోకూదన్న తెలివి ఇప్పుడు వచ్చిందా బాబు?
X
అవసరానికి మించిన ఆవేశంతో అనర్దమే ఎక్కువ జరుగుతుంది. అయితే.. ఈ విషయం ఆవేశ పడటానికి ముందే అర్థం కావాలి. మొత్తం కాలిపోయాక.. తత్త్వం బోధ పడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. టీడీపీ అధినేత.. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా.. ప్రజల మైండ్ సెట్ తో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైనాన్ని మర్చిపోలేం.

మోడీతో గొడవ అవసరం లేకున్నా.. తాను నమ్మిన మీడియా సంస్థల నివేదికలు.. నిఘా వర్గాల అంచనాలతో పాటు.. తనకున్న తెలివితో మోడీతో పెట్టుకున్నట్లుగా ప్రజల్ని నమ్మేలా చేస్తే.. తన ఐదేళ్ల విఫల పాలనను మర్చిపోయి.. భావోద్వేగంతో ఓట్లు గుద్దేస్తారని.. అధికారం మరోసారి తన వశం అవుతుందని పిచ్చి లెక్కను వేసుకోవటం తెలిసిందే.

బాబు కంటే మేధావులైన ఆంధ్రోళ్లు.. ఆయనకు కర్ర కాల్చి మరీ ఓటమి వాత పెట్టేశారు. దారుణ పరాజయం తర్వాత కానీ బాబుకు ఒక్కో విషయం అర్థం కాని పరిస్థితి. తాను చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్న ఆయన.. వాటిని దిద్దుకోవాలన్న తొందరలో మరింత కామెడీగా మారుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఆయన తాజా మాటల్ని చెప్పక తప్పదు.

మంచికో చెడుకో మోడీతో పెట్టుకున్నారు. ఆయనపై విషం జల్లేలా తీవ్రస్థాయిలో విమర్శలు.. ఆరోపణలు చేశారు. కేంద్రంలో తాను చక్రం తిప్పే రోజు వచ్చేసిందంటూ హడావుడి చేశారు. ఇంతా చేస్తే.. చివరకు ఆంధ్రోళ్లు 23 సీట్లకే పరిమితం చేశారు. తన తాజా పరిస్థితికి మోడీ కూడా కారణమని భావిస్తున్న చంద్రబాబు.. చేసిన తప్పుల్ని తాను తెలుసుకున్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఆయన మోడీతో తనకున్న వైరం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మోడీతో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి విరోధం లేదని.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను అప్పట్లో పోరాటం చేసినట్లుగా బాబు చెప్పారు. అదే నిజమైతే.. హద్దులు దాటేసేలా మోడీ మీద తీవ్రస్థాయిలో దునుమాడటాన్ని మర్చిపోకూడదు.

కావాల్సినప్పుడు తిట్టిపోయటం.. అవసరమైనప్పుడు అక్కున చేర్చుకోవాలనుకునే చంద్రబాబుకు తగ్గట్లు పరిస్థితులు ఉండవన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నారు. మోడీతో పెట్టుకొని చేయకూడని తప్పు చేసిన బాబు.. ఇప్పుడు దిద్దుపాటు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆయన పడుతున్న ప్రయాసను చెప్పేస్తున్నాయి. అదే సమయంలో.. ఇప్పుడు చెబుతున్న చిలుక పలుకలు ఎన్నికల ప్రచార వేళలో చెబితే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. అనాల్సిన మాటలన్ని అనేసి.. ఇప్పుడు వ్యక్తిగత విరోధం లేదనేయటంతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న మాట వినిపిస్తోంది.