Begin typing your search above and press return to search.

ఈ సవాలు ఇన్నాళ్లు ఏమైంది బాబు

By:  Tupaki Desk   |   28 April 2016 4:08 AM GMT
ఈ సవాలు ఇన్నాళ్లు ఏమైంది బాబు
X
కొన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించటం అధినేతలకు అలవాటే. కొన్నిసార్లు ఆ తీరు వారిని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. లక్ష కోట్ల రూపాయిల మాటతో వైఎస్ జగన్ ను బద్నాం చేయటంలో టీడీపీ అధినేత విజయం సాధించారు. ఆ విషయంలో ఆయన సాధించిన విజయం ఎలాంటిదంటే.. లక్ష కోట్ల మాటకు జగన్ ప్రతిరూపమన్నట్లుగా మారిన పరిస్థితి. తనను ఇంత దారుణంగా దెబ్బ తీసిన చంద్రబాబు మీద బదులు తీర్చుకున్న చందంగా జగన్ రూ.2లక్షల కోట్ల అక్రమార్జనపరుడిగా చంద్రబాబును చిత్రీకరించాలన్న ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇందుకు తగ్గట్లే రెండేళ్ల వ్యవధిలో చంద్రబాబు అక్రమంగా రూ.1.34లక్షల కోట్ల అవినీతి సొమ్ము వెనకేసుకున్నట్లుగా జగన్ ప్రచారం మొదలెట్టారు. నిజానికి ఈ ఆరోపణలు చేసిన వెంటనే బాబు రియాక్ట్ అవుతారని కొందరు భావించినా.. ఆయన పెద్దగా స్పందించలేదు. జగన్ తన మీద ఆరోపణలు చేసిన వెంటనే తాను కానీ ప్రతిస్పందిస్తే.. ఆ వ్యాఖ్యలకు తాను ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందన్నఉద్దేశంతో మిన్నకుండిపోయినట్లుగా చెబుతారు.

అంత భారీ మొత్తాన్ని తన ఖాతాలో వేయటాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకోలేదని కూడా చెప్పాలి. పగలు.. రాత్రి అనక కష్టపడటం.. అవినీతిని కట్టడి చేయటంలో కొంతమేర మాత్రమే చేయగలిగారు. ఇక.. సీఎంగా తన మీద భారీ ఆరోపణలు రాకుండా చూసుకోవటంలో బాబు జాగ్రత్తపడినట్లు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.1.34లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై బాబు సీరియస్ గా తీసుకోలేదని చెప్పాలి.

ఏదైనా ఆరోపణ తెర మీదకు వచ్చినప్పుడు ఆ విషయాన్ని మొదటికంటా తుంచేలా తీవ్రంగా విరుచుకుపడితే బాగుండేది. అందుకు భిన్నంగా.. పట్టించుకోనట్లుగా వ్యవహరించారు. కానీ.. జగన్ మాత్రం తాను చేసిన ఆరోపణను.. అదే పనిగా చేయటం.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఇదే నినాదాన్ని జపించటం.. తాను చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పేరిట చంద్రబాబు అవినీతి మీద పుస్తకాన్ని అచ్చేయటంతో బాబు అండ్ కో ఉలిక్కిపడిన పరిస్థితి.

అందుకేనేమో.. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్ చేసిన ఆరోపణలపై బాబు సీరియస్ అయ్యారు. జగన్ చేస్తున్న రూ.లక్ష కోట్ల అవినీతిని రుజువు చేయాలని సవాలు విసిరారు. రూ.లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో చూపించాలని మండిపడుతున్నారు. ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావటమే తన లక్ష్యంగా బాబు చెబుతున్నారు.

నిద్రాహారాలు మాని అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కష్టపడుతుంటే.. జగన్ అందుకు భిన్నంగా బాధ్యత లేకుండా విమర్ళలు చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడుతున్నారు. నిజానికి చంద్రబాబు ఇప్పుడు చెబుతున్న మాటలే గతంలోనే చెప్పేసి.. సవాలు బలంగా విసిరి ఉంటే బాగుండేదేమో. అందుకు భిన్నంగా ఇప్పుడు స్పందించటం వల్ల జరిగే లాభంలో ఎంతన్నది డౌటే నని చెప్పక తప్పదు. తన మీద జగన్ చేసిన అవినీతి ఆరోపణల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న చంద్రబాబు కాస్త బ్యాలెన్స్ గా విమర్శలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.