Begin typing your search above and press return to search.

బ్రిట‌న్ దెబ్బ‌కు బాబు క‌ల క‌రిగిపోయింది

By:  Tupaki Desk   |   19 Feb 2017 4:16 AM GMT
బ్రిట‌న్ దెబ్బ‌కు బాబు క‌ల క‌రిగిపోయింది
X
న‌వ్యాంద్ర‌ప్రదేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గురించి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. విదేశీ ప‌ర్య‌ట‌న‌లంటే తెగ ఆస‌క్తి చూపించే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బ్రిటన్ ప్రభుత్వం పెద్ద ఝలక్ ఇచ్చిందని అక్క‌డి పాత్రికేయ‌వ‌ర్గాల్లో తెగ చ‌ర్చించుకుంటున్నాయి. ఏ దేశం వెళితే ఆ దేశంలా అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పే బాబుకు ఈ షాక్ తిన‌డంతో ఏకంగా తన లండన్ పర్యటననే రద్దు చేసుకున్నారని అంటున్నారు. అమరావతిపై ప్ర‌క‌ట‌న‌లు చెప్ప‌డం, ప్ర‌జెంటేష‌న్లు ఇవ్వ‌డం కాకుండా వాస్తవంగా ఏం చేశారో చెప్పమని నిలదీయడంతో ఖంగుతిన్న చంద్ర‌బాబు బ్రిటన్ పర్యటనకు మంత్రి నారాయణను పంపించార‌ని మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

అమరావ‌తిలోని పాత్రికేయుల స‌మాచారం మేర‌కు బ్రిటన్‌ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ విభాగం ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు లండన్‌ లో ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ వాటర్‌ టెక్నాలజీపై ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఆధునిక సాంకేతిక పురోగతి, మార్కెటింగ్‌ అవకాశాలపై విస్తృత చర్చలు జరపడం ఈ సదస్సు ముఖ్యోద్దేశం. ఇందులో పాల్గొనేందుకు మరికొందరితో పాటు ఏపీ సర్కారుకూ ఆహ్వానం అందింది. అయితే సదస్సులో చెప్పాలనుకునే విషయాన్ని ముందుగా తమకు తెలియజేయాలని ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ విభాగం కోరింది. ఏ దేశం వెళితే ఆ దేశంలా, ప్రపంచస్థాయిలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పే చంద్రబాబు ఈసారి కూడా భవిష్యత్తులో ఎంత అద్భుతంగా రాజధానిని తీర్చిదిద్దబోయేదీ సవివరంగా తెలియజేసేలా ఓ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాబు డైరెక్షన్‌ మేరకు అధికారులు ప్రజెంటేషన్‌ ను తయారు చేశారు. చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని నిర్మాణానికి రైతులంతా భూములిచ్చారని, ఆయన తన సమ్మోహనా శక్తితో లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని, ఇంటర్నేషనల్‌ స్కూళ్ళు - కాలేజీలు తరలి వస్తున్నాయని, పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, రాజధాని పరిధిలో భవిష్యత్‌లో 3 లక్షల ప్రత్యక్ష, 5.5 లక్షల పరోక్ష ఉద్యోగాలు రాబోతున్నాయంటూ గ్రాఫ్‌ లతో సహా అద్భుత ఊహాచిత్రానికి రూపకల్పన చేసి సీడీ రూపంలో బ్రిటన్‌ కు పంపారు.

అయితే ఇక్క‌డే షాక్ త‌గిలింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం పంపిన నివేదికపై బ్రిటన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఊహాగానాలు కాకుండా ఇప్పటివరకు సాధించిన పురోగతి చెబితే బాగుంటుందని తెలిపింది. సదస్సులో వాస్తవాలను ప్రస్తావించాలని సూచించినట్టు తెలిసింది. దీంతో లండన్‌ వేదికగా మరోసారి అంతర్జాతీయ సమాజానికి లెక్చర్‌ ఇవ్వాలనుకున్న చంద్రబాబు ఊహించని ఈ పరిణామంతో తన పర్యటన రద్దు చేసుకున్నారని అధికారవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి బ్రిటన్ పర్యటన రద్దుకు అధికారులు పూతమందు పూసే ప్రయత్నం చేశారు. లండన్‌ లో జరిగే ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సదస్సుకు వాస్తవంగా ముఖ్యమంత్రి వెళ్ళాల్సి ఉందని, కానీ ఆయన దైనందిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఆయన ప్రతినిధిగా మంత్రి నారాయణ వెళ్తున్నారని అధికారులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/