Begin typing your search above and press return to search.

మోడీ కంటె జైట్లీని తేగలిగితే ఎక్కువ లాభం!

By:  Tupaki Desk   |   5 Oct 2015 8:29 PM GMT
మోడీ కంటె జైట్లీని తేగలిగితే ఎక్కువ లాభం!
X
ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ప్రధాని నరేంద్రమోడీని స్వయంగా కలిసి.. తాము తలపెడుతున్న రాజధాని అమరావతి గురించిన వివరాలన్నిటినీ విపులంగా తెలియజెప్పి మన రాష్ట్రానికి వచ్చి శంకుస్థాపన చేయాల్సిందిగా.. విన్నవించారు. రాజధాని గురించి మన స్వప్నాలేంటో.. ఆశలేంటో కూడా ప్రధానికి బహుశా ఆయన వివరించే ఉంటారు. అయితే ఆయనను ఏదో కార్యక్రమానికి ఆహ్వానించడం మాత్రమే కాదన్నది అందరికీ తెలిసిన సంగతే.

ప్రధాని మన శంకుస్థాపనకు రావడం అంటే.. రాష్ట్రంలోని 5 కోట్ల మంది తెలుగు ప్రజలు కూడా.. రాబోయే ప్రధాని మనకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారో ఏమో అని ఎదురుచూస్తూ ఉంటారు. ప్రధాని వస్తున్నారంటేనే.. మనందరి ఆశలు ఆయన మీద కేంద్రీకృతం అయి ఉంటాయి. అసలే మన రాష్ట్రం ప్రత్యేకహోదా గురించి, స్పెషల్‌ ప్యాకేజీల గురించి.. మోడీ మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇన్నాళ్లూ తెదేపా, భాజపా నేతలు ఎన్ని రకాలుగా మాటలు మార్చినా.. మనకు హామీ ఇచ్చింది మోడీనే గనుక.. ఆయన ఇప్పటిదాకా నోరు విప్పలేదు గనుక.. ఈ వేడుకకు ఆయన వస్తే.., వరాల వెల్లువ తప్పదని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఈనేపథ్యంలో ఏపీలోని ఒక వర్గం మేధావుల్లో మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చంద్రబాబు మోడీ తోపాటు కేంద్రంలోని పెద్దలను ఇంకా ఎవరెవరిని ఆహ్వానించబోతున్నారో గానీ.. అరుణ్‌జైట్లీని గనుక రప్పించగలిగితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని పలువురు అంటున్నారు. ఎందుకంటే.. మోడీ ఎన్ని రకాల హామీలు ఇచ్చినప్పటికీ.. ఆర్థిక మంత్రి హోదాలో వాటికి కార్యరూపంలో బ్రేకులు వేయగల, కత్తెర వేయగల అధికారం కూడా జైట్లీ చేతిలోనే ఉంటుంది. పైగా, ఇటీవలి సందర్భాల్లో ఆయన వైఖరి ఆంధ్రప్రదేశ్‌ మీద ఎలాంటి ప్రత్యేక సానుభూతి లేదన్నట్లుగానే కనిపించింది.

అలాంటి నేపథ్యంలో.. మోడీ వచ్చి దేవుడిలాగా మన రాష్ట్రానికి వరాలిచ్చి వెళ్లిపోయినంత మాత్రాన నమ్మలేం అని పలువురు అంటున్నారు. దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వలేదన్న సామెత చందంగా మన పరిస్థితి మారిపోతుందని వారు అంటున్నారు. జైట్లీని కూడా కార్యక్రమానికి ఆహ్వానించి, బతిమాలి అయినా సరే రప్పించగలిగితే.. చాలా బాగుంటుందని.. ఆయన స్వయంగా ఏమైనా హామీలు ఇస్తే.. అంతవరకు ఖచ్చితంగా అమలవుతాయని కేంద్రం తీరుతెన్నులు తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఏ వెంకయ్యనాయుడు వద్దనో మాట్లాడినం సునాయాసంగా జైట్లీ వద్ద కూడా చంద్రబాబు మంతనాలు సాగించి, రప్పించగలరా? అనేది చర్చనీయాంశంగా ఉంది.