Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ లో బాబు ముద్ర వేస్తున్నారు!

By:  Tupaki Desk   |   22 Oct 2016 6:59 AM GMT
హైద‌రాబాద్‌ లో బాబు ముద్ర వేస్తున్నారు!
X
ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మ‌రోమారు హైద‌రాబాద్‌ లో త‌నదైన ముద్ర వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. స‌మైక్య రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు భాగ్య‌నగరానికి ఐటీ ముద్ర‌ను జోడించిన చంద్ర‌బాబు ఇపుడు ఉమ్మ‌డి రాజ‌ధాని అయిన హైద‌రాబాద్‌ లో ఆంధ్రప్రదేశ్ వాసుల కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్ర‌బాబు అధ్యక్ష‌త‌న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సభ్యులు హాజరయిన ఈ స‌మావేశంలో ఢిల్లీ తరహాలో ఏపీ భవన్ మాదిరిగా ఓ భవనాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటుచేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. హైద‌రాబాద్‌ ప‌దేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకునే వెసులుబాటును క‌లిగించారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వంతో చర్చించే బాధ్యతలను సుజనా చౌదరికి అప్పగించాలని సమావేశం నిర్ణయించింది.

ఏపీ సచివాలయానికి పాలన యంత్రాంగం తరలివెళ్లిన నేపథ్యంలో హైదరాబాద్ భవనాలను స్వాధీన పరచాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై పొలిట్‌ బ్యూరోలో చర్చించారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఢిల్లీ తరహాలో ఏపీ భవన్ మాదిరిగా ఓ భవనాన్ని ఏర్పాటుచేస్తే హైదరాబాద్ సచివాలయ భవనాలు అప్పగిద్దామని సుజనాచౌదరి ప్రతిపాదించగా సమావేశం ఆమోదించింది. దీంతోపాటు షెడ్యూల్ ఆస్తుల బదలాయింపు - ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే అంశాలను తరచు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన సాధించే విధంగా సంప్రదింపులు జరపాలని సుజనాచౌదరికి చంద్ర‌బాబు సూచించారు.

పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాలను లేవనెత్తాలని నిర్ణయించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9 - 10కి సంబంధించిన ఆస్తుల బదలాయింపు ప్రక్రియ వేగవంతం కావాలని, ఇందుకు కేంద్ర మంత్రులు - ఎంపీలు చొరవ చూపాలని చంద్రబాబు ఆదేశించారు. నల్లధనం నిర్మూలనకు ప్రధానమంత్రి అమలు చేస్తున్న విధానాలను స్వాగతిస్తూ 1000 - 500 నోట్లను నిషేధించాలని సమావేశం తీర్మానించింది. ఇదిలా ఉండగా కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని - దీనివల్ల రెండు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే వాదనను సీఎం చంద్రబాబు లేవనెత్తారు. దీనిపై కేంద్రంతో చర్చించటం లేదా సమన్వయంతో సాధించుకోవటం.. అప్పటికీ వీలుకాకపోతే సుప్రీం కోర్టులో ఏపి వాదనలు వినిపించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు.

మ‌రోవైపు వచ్చే జనవరిలో శాసనమండలి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలపై పొలిట్‌ బ్యూరోలో చర్చ జరిగింది. సమర్థులైన - పార్టీకి అంకితభావంతో పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు తేల్చిచెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు - ఓటరు నమోదుకు కసరత్తు జరపాలని సూచించారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నెలరోజుల పాటు నిర్వహించే జనచైతన్య యాత్రల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏయే వర్గానికి ప్రాతినిధ్యం కల్పించిందీ వివరించారు. మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని ప్రతిపాదించారు. షెడ్యూల్డ్ ఆస్తుల బదలాయింపు, ప్రభుత్వరంగ సంస్థల విభజన తరువాత మరిన్ని నామినేటెడ్ పదవులు భర్తీచేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో కరవు పరిస్థితులపై టీటీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పొలిట్‌బ్యూరో సభ్యులు రేవంత్‌ రెడ్డి - రావుల చంద్రశేఖర్‌ రెడ్డి - మోత్కుపల్లి నరసింహులు - ఎల్ రమణ - రమేష్ రాథోడ్ - నామా నాగేశ్వరరావు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. జిల్లాలు - మండలాల విభజనతో అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. దీనిపై పార్టీ అధినేత స్పందిస్తూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నించాలని - పార్టీ శ్రేణులను జాగృతపరచి సభ్యత్వ నమోదుపై దృష్టిసారించాలన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/