కేసీఆర్ బాటలోనే బాబు.. 9 సేవ్ చేస్తుందా?

Fri Mar 15 2019 10:36:25 GMT+0530 (IST)

జాతకాలు.. మహుర్తాలు.. నమ్మకాలు.. విశ్వాసాలు.. ఇలాంటి మాటలు విన్నంతనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చప్పున గుర్తుకు వస్తుంటారు. ఆయనకున్న సెంటిమెంట్లు ఎన్నో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని నమ్మకాల విషయంలో కేసీఆర్ ఎంత పక్కాగా ఉంటారన్న విషయం ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు చెప్పకనే చెప్పేశాయి.తనకెంతో సెంటిమెంట్ అయిన ఆరు అంకె వచ్చేలా జాబితా విడుదల మొదలు.. ప్రభుత్వాన్ని రద్దు చేసే ముహుర్తం వరకూ అన్నింటి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేసిన కేసీఆర్ కు తగ్గట్లే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలి ఉందని చెప్పాలి.

చూసేందుకు మోడ్రర్న్ గా కనిపించే చంద్రబాబుకు కూడా నమ్మకాలు.. సెంటిమెంట్లు ఎక్కువే. తన నమ్మకాల గురించి బయటకు తెలిసేలా కనిపించని బాబు.. కీలకమైన అన్ని సందర్భాల్లోనూ మహుర్తానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల విషయంలో బాబు వ్యవహరించిన ధోరణి మీడియాకు చుక్కలు చూపించిన పరిస్థితి.

అభ్యర్థుల జాబితాను ముందే సిద్ధం చేసినప్పటికీ.. తాను నమ్మిన ముహుర్తం వేళ వరకూ వెయిట్ చేయించి మరీ జాబితాను చేతికి ఇవ్వటం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు అంకెను తన అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ఇందుకు తగ్గట్లే.. ఆయన తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నది కూడా ఆరు అంకె వచ్చేలా అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

తన అదృష్ట సంఖ్య అయిన ఆరును అమితంగా ఇష్టపడే కేసీఆర్ కు తగ్గట్లే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నమ్మకాలకు పెద్ద పీట వేస్తారన్న విషయం మరోసారి రుజువైంది. అమరావతిలో తన తొలి జాబితాను విడుదల చేసే వేళను.. తనకెంతో నమ్మకస్తుడైన సిద్ధాంతి చెప్పిన ముహుర్తంలోనే జాబితాను విడుదల చేయటం గమనారహం. అంతేకాదు..  బాబు లక్కీ నెంబరు 9. దీనికి తగ్గట్లే తాజాగా ఆయన ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 126. ఈ అంకెల్ని కలిపితే చివరకు వచ్చే సంఖ్య 9 కావటం గమనార్హం. మహుర్తాన్ని నమ్ముకున్న కేసీఆర్ కు ఫలితం సానుకూలంగా వచ్చింది సరే.. మరి బాబు విషయంలో ఏమవుతుందో చూడాలి.