Begin typing your search above and press return to search.

హైటెక్‌ పార్కింగ్‌ చంద్రబాబుకు తెలియదా?

By:  Tupaki Desk   |   28 Aug 2016 11:30 AM GMT
హైటెక్‌ పార్కింగ్‌ చంద్రబాబుకు తెలియదా?
X
చంద్రబాబునాయుడు ఇప్పుడు అచ్చంగా పాత హైటెక్‌ చంద్రబాబునాయుడే అయిపోయాడు. పదేళ్ల విరామం తర్వాత కొత్తగా పాలన పగ్గాలు చేతపట్టినప్పుడు.. తాను ఇప్పుడు మారిపోయిన చంద్రబాబును అంటూ తన గురించి తాను చెప్పుకున్నారు. కానీ, తాజాగా తాను సాధిస్తున్న యాప్‌ల విప్లవం గురించి మాట్లాడుతున్నప్పుడు, కమాండ్‌ కంట్రోల్‌ తప్ప రాష్ట్రంలో మరో విషయమే లేనట్లుగా దాని గురించి సాగిస్తున్న ప్రచారం చూస్తున్నప్పుడు ఆయన మళ్లీ హైటెక్‌ బాబు అయిపోయారని అర్థమవుతుంది. అయితే కావొచ్చు గాక.. కానీ ఇంత హైటెక్‌ బాబుకు.. హైటెక్‌ పార్కింగ్‌ - వర్టికల్‌ కారు పార్కింగ్‌ గురించి - ఆ ఏర్పాట్ల గురించి ఏమాత్రం తెలియదా? అనేది జనానికి సందేహం కలుగుతోంది. ఎందుకంటే..

వెలగపూడిలో 45 ఎకరాల్లో సెక్రటేరియేట్‌ కడుతున్నారు. అయితే ఇందులో 25 ఎకరాలకు మాత్రం ప్రహరీ నిర్మించి - మిగిలిన 20 ఎకరాలను పార్కింగ్‌ కు కేటాయించబోతున్నారట. ఇంత హైటెక్‌ అని చెప్పుకుంటున్న అమరావతి నగరంలోని సెక్రటేరియేట్‌ కు 20 ఎకరాల విశాలమైన పార్కింగ్‌ అంటే ఎవరైనా నవ్విపోతారు. ఎందుకంటే.. ఆధునిక తరంలో స్థలం విలువ పెరుగుతున్న నేపథ్యంలో వర్టికల్‌ కార్‌ పార్కింగ్‌ టెక్నాలజీ బాగా ఆదరణ పొందుతోంది. ఒక కారు పెట్టే ప్రదేశంలో సులువుగా పది కార్లు పెట్టవచ్చు. ఇలాంటి టెక్నాలజీ కేవలం ఒకటి రెండు ఎకరాల జాగాలో సచివాలయం అన్ని బ్లాకులకు పార్కింగ్‌ అవకాశం ఇవ్వచ్చు. అలాంటి ఆధునిక తరం ఏర్పాట్లు చూడకుండా.. చంద్రబాబునాయుడు రియల్‌ వేల్యూ చాలా ఎక్కువగా ఉన్న 20 ఎకరాల భూములను పార్కింగ్‌ కు కేటాయించడం మరీ పాచిపోయిన ఆలోచనలాగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎవరు ఎలాంటి యాప్‌ లు తెచ్చి - ఎవరు వచ్చి ఎలాంటి డీల్‌ లతో ప్రతిపాదనలను పెడితే వాటిని యాక్సెప్ట్‌ చేసి అవే టెక్నాలజీ అన్నట్లుగా డప్పు కొట్టడం కాదు.. మోడర్న్‌ సిటీగా ఉండాలంటే.. ప్రత్యేకవిమానాలు వేసుకుని అన్ని దేశాలు తిరిగివచ్చిన చంద్రబాబు మరియు కోటరీకి కనీసం వర్టికల్‌ కార్‌ పార్కింగ్‌ కాన్సెప్ట్‌ తెలియదా అని జనం నవ్వుకుంటున్నారు.