Begin typing your search above and press return to search.

ఏపీలో జగన్ ఖాయం.‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎.మహాకూటమి సాయం!

By:  Tupaki Desk   |   15 Nov 2018 5:57 AM GMT
ఏపీలో జగన్ ఖాయం.‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎.మహాకూటమి సాయం!
X
తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఎవరు గెలుస్తారో తేలెందుకు ఇంకా కొన్ని రోజులే గడువుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం ప్రతిపక్ష వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాత్రం ఇప్పుడే తేలిపోయింది. అదేమిటి ఇంకా ఎన్నికలు ఏడాది ఉన్నాయిగా... ఇప్పుడే జగన్ ముఖ్యమంత్రి కావడమేమిటి అని అనుకుంటున్నారా. ఇది తిక్కతో చెబుతున్న లెక్క కాదు... దీనికి సమాధానం తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలే చెబుతున్నాయి.

తెలంగాణ‌లో తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించేందుకు బద్ద శత్రువులైన కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. దీని ప్రభావం తెలంగాణలో గెలుపు మాట అటుంచితే ఆంధ్రప్రదేశ్‌ లో వీరి ఓటమిని మాత్రం ఖయం చేస్తోంది. ఈ రెండు పార్టీల కలయికని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు... కొండకచో తెలుగుదేశం నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకతకు తోడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెట్టపట్టాలేసుకుని ఒకే వేదిక మీద కనిపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించే పరిస్థితి ఉండదు. ఈ పరిణామమే ఆంధ్రప్రదేశ్‌ లో జగన్ మోహన రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి సహకరిస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ప్రత్యేక హోదా పేరుతో బిజెపితో చేతులు కలిపిన చంద్రబాబు ఇప్పుడు అదే సాకుతో కాంగ్రెస్‌ తో కలిస్తే అది జగన్ మోహన రెడ్డికి నేరుగా సాయం చేయడమే అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ - నారా చంద్రబాబు నాయుడు - తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. పోలీస్‌ వర్గాలు - నిఘా సంస్దల నివేదికలు సమాచారం మేరకు ఏపీలో చంద్రబాబు నాయుడి ఓటమి ఖాయం అంటున్నారు. ప్రతిపక్ష నేత జగన్ మోహన రెడ్డికి ప్రజల మద్దతుతో పాటు కాలం కూడా కలిసివస్తోంది. ఈ పరిణామాలతో పాటు తెలంగాణలో చిగురించిన కొత్త స్నేహాలు ఆంద్రప్రదేశ్‌ లో వాడిపోవడం తప్పదని చెబుతున్నారు. ఓ తెలుగు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్నికలు జరుగుతుంటే - ప‌క్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రంలో అధికారం ఎవరిదో ఏడాదికి ముందే తేలిపోవడం రాజకీయ వైచిత్రిగా పేర్కొంటున్నారు.