Begin typing your search above and press return to search.

నాటి మిత్రులే నేడు బాబుకు శ్ర‌తువులు!

By:  Tupaki Desk   |   15 Dec 2018 10:36 AM GMT
నాటి మిత్రులే నేడు బాబుకు శ్ర‌తువులు!
X
బీజేపీ - టీఆర్ ఎస్ ల పేరు చెప్తేనే భ‌గ్గుమంటున్నారు చంద్ర‌బాబు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టీడీపీకి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి వైసీపీ అయిన‌ప్ప‌టికీ బాబు దృష్టి మొత్తం ఇప్పుడు క‌మ‌ల ద‌ళం - గులాబీ ద‌ళంపైనే ఉంది. ఆ రెండు పార్టీల‌ను ఎలా దెబ్బ‌తీయాల‌నే ఆలోచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌ప్ప‌టికీ వైసీపీతో వైరానికి పెద్ద‌గా ప్రాధాన్య‌మే ఇవ్వ‌డం లేదాయ‌న‌!

నిజానికి బీజేపీ - టీఆర్ ఎస్ రెండూ బాబుకు ఇంత‌కుముందు మిత్ర‌ప‌క్షాలు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు నుంచే బాబు మోదీ భ‌జ‌న ప్రారంభించారు. దాదాపు నాలుగేళ్ల‌పాటు ఎన్డీయేలో భాగ‌స్వామ్య ప‌క్షంగా ఉంది టీడీపీ. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా ప్ర‌త్యేక ప్యాకేజీని ప్ర‌క‌టించినప్పుడు కూడా చంద్ర‌బాబు మోదీ ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వంత‌పాడారు. అనంత‌రం రాష్ట్రంలో ప‌రిస్థితులు మారిపోవ‌డంతో రూటు మార్చారు. అస‌లుకే ఎస‌రు వ‌స్తోంద‌ని గ్ర‌హించారు. హోదా వైపు మొగ్గుచూపారు. కేంద్రంతో క‌య్యానికి దిగారు.

కేసీఆర్ నేతృత్వంలోని గులాబీ ద‌ళంతోనూ చంద్ర‌బాబు గ‌తంలో బాగానే ఉండేవారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఆ పార్టీతో పొత్తుకు కూడా ప్ర‌య‌త్నించారు. స‌మ‌యం - సంద‌ర్భం చూసుకోకుండా హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌లకు వ‌చ్చిన‌ప్పుడు కూడా కేటీఆర్ తో పొత్తుల‌పై మాట్లాడారు. త‌మ‌తో జ‌త క‌ట్టేందుకు టీఆర్ ఎస్ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో బాబు ఆగ్ర‌హించారు. కాంగ్రెస్ తో క‌లిశారు. అయితే - వారి కూట‌మి తెలంగాణ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చూసింది. టీడీపీని చిత్తు చేసిన టీఆర్ ఎస్ అక్క‌డితో ఆగ‌లేదు. ఏపీ రాజ‌కీయాల్లో వేలు పెడ‌తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో చంద్ర‌బాబు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

మ‌రోవైపు - తెలంగాణ‌లో టీఆర్ ఎస్ విజ‌యంతో ఏపీలో జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ సంబ‌రాలు చేసుకుంటోంది. ఈ ప‌రిణామం టీడీపీకి మ‌రింత కంట‌గింపుగా మారింది. వైసీపీ - టీఆర్ ఎస్ మ‌ధ్య దోస్తీ కుదిరిందంటూ తెలుగుదేశం పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వారి జోడీని త‌ప్పుప‌డుతున్నారు. దీంతో టీడీపీపై రాజ‌కీయ విశ్లేష‌కులు మండిప‌డుతున్నారు. బీజేపీ - టీఆర్ ఎస్‌ ల‌తో ఇన్నాళ్లూ తెలుగుదేశం నేత‌లు అంట‌కాగ‌లేదా అని నిల‌దీస్తున్నారు. మీరు దోస్తీ చేస్తే త‌ప్పు లేదు కానీ వేరే వాళ్లు చేస్తే త‌ప్పా అని ప్రశ్నిస్తున్నారు.