Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ పై బాబు కొత్త ఆరోప‌ణ మ‌త‌ల‌బు ఏంటో?

By:  Tupaki Desk   |   17 Oct 2017 5:33 AM GMT
జ‌గ‌న్‌ పై బాబు కొత్త ఆరోప‌ణ మ‌త‌ల‌బు ఏంటో?
X
ఏపీలో రాజ‌కీయం వేడెక్కుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఒవ‌కైపు వైసీపీ అధ్య‌క్షుడు - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌కు సిద్ఢ‌మ‌వ‌డం మ‌రోవైపు ఆ పార్టీ నుంచి అధికార టీడీపీలోకి చేరిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఈ కీల‌క‌మైన ప‌రిణామాల‌కు తోడుగా తాజాగా ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు నాయుడు మ‌రో సంచ‌లన కామెంట్ చేశారు. వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌ పై త‌ర‌చుగా చేసే అవినీతి ప‌రుడు - ప‌ద‌వీ కాంక్ష ఉన్న వ్య‌క్తి అని కాకుండా.... ఈ ద‌ఫా మ‌రో కొత్త‌ ఆరోప‌ణ చేశారు.

ఉండవల్లిలోని తన నివాసంలో ఇంటింటికీ తెలుగుదేశంపై రూపొందించిన ఆడియో సీడీని సోమవారం రాత్రి ఆవిష్కరించిన సందర్భంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ నాన్ రెసిడెంట్ అని కొత్త ఆరోప‌ణ చేశారు. బయటివారి వల్ల రాష్ట్రానికి ఇబ్బందులు వస్తున్నాయని సంచ‌ల‌న కామెంట్ చేశారు. విజయవాడ‌లో బీసీలతో జగన్ సమావేశం ఏర్పాటు చేయడంపై సీఎం చంద్ర‌బాబు స్పందిస్తూ - సమావేశం పెడితే తరలివచ్చినట్లా అంటూ ప్రశ్నించారు. గత రికార్డులు పరిశీలిస్తే - బీసీలపై ఆయన తండ్రి ప్రభుత్వం కక్ష కట్టిందని తెలుస్తుందని తెలిపారు. కష్టాలున్నా - అభివృద్ధి - సంక్షేమం సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. తాము చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఇది ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో తెలుస్తోందన్నారు. ఇప్పటికి 60 లక్షల ఇళ్లను సందర్శించామని, ఆ వివరాలను ట్యాగింగ్ చేశామన్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. ఒక పార్టీ ఇలా చేయడం ఒక చరిత్ర అన్నారు. 20 లక్షల సమస్యలు వచ్చాయని, వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

తమ పార్టీకి ప్ర‌జ‌లు బ్రహ్మరథం పడుతున్నారన్నారనే విష‌యంలో కాకినాడ - నంద్యాల ఎన్నికల తరువాత మ‌రోమారు తెలిసింద‌ని చంద్ర‌బాబు అన్నారు. ప్రజల సంతోషమే కొలమానంగా పని చేస్తున్నామని తెలిపారు. తాము చేపడుతున్న అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలతో 175 నియోజకవర్గాల్లో బలంగా ఉండాలని, గెలవాలని, ఆ విధంగా ప్రణాళిక వేస్తున్నట్లు వెల్లడించారు. డ్వాక్రా మహిళలకు 3000 కోట్ల రూపాయల మేర చెల్లించాల్సి ఉందన్నారు. 28 ప్రాజెక్టులను 13 వేల కోట్ల రూపాయలతో - 6 నెలల్లో ప్రత్యేక ప్రాజెక్టుగా పూర్తి చేసేందుకు నిర్ణయించామన్నారు. పోలవరం కాంట్రాక్టరు తొలగింపుపై కేంద్ర మంత్రి గడ్కరి వ్యాఖ్యలపై స్పందిస్తూ, తాము చెల్లించిన నిధులను ట్రాన్స్‌ ట్రాయ్ సంస్థ సబ్ కాంట్రాక్టర్లకు చెల్లించడం లేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. ఈ విషయాన్ని మంత్రికి కూడా వివరించామన్నారు. నిధులు చెల్లించకపోతే, పనులు నిలిచిపోయే ప్రమాదం ఉందని, సీజన్ వృథా అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇంటర్ విద్యార్థుల అత్మహత్యలపై స్పందిస్తూ, ఒక కమిటీని నియమించామని, ఆ నివేదికను నెల రోజుల తరువాత సమీక్షిస్తానన్నారు. ఇంటర్‌ లో మార్కుల బదులు గ్రేడింగ్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు.