Begin typing your search above and press return to search.

అవినీతికి పాల్ప‌డ‌కుండానే ఎదిగానంటున్న బాబు

By:  Tupaki Desk   |   27 Jun 2017 9:55 AM GMT
అవినీతికి పాల్ప‌డ‌కుండానే ఎదిగానంటున్న బాబు
X
ఎలాంటి అవినీతికి పాల్ప‌డ‌కుండానే త‌ను ఎదుగుతూ, తాను స్థాపించిన సంస్థ‌ల‌ను పైకి తీసుకువ‌చ్చాన‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఇంటర్‌ నేషనల్‌ ఎంఎస్‌ ఎంఈ డే 2017ను ప్రారంభించిన అనంతరం సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభించే ఏకైక రంగం చిన్న - మధ్య తరహా పరిశ్రమ అని తెలిపారు. తాను కూడా హెరిటేజ్‌ అనే ఓ చిన్న పరిశ్రమ నుంచి ఈ స్థాయికి ఎదిగినట్లుగా పేర్కొన్నారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా హెరిటేజ్‌ ను ఈ స్థాయికి తీసుకొచ్చానని తెలిపారు. తాను సైతం ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌తో ఉన్న‌త స్థానానికి ఎదిగాన‌ని చంద్ర‌బాబు తెలిపారు.

దేశంలోనే తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక అభివృద్ధి సంస్థను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్ర‌క‌టించారు. సూక్ష్మ - చిన్న - మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహమే లక్ష్యంగా ఈ సంస్థను తీర్చిదిద్దిన‌ట్లు చంద్ర‌బాబు వివ‌రించారు. దేశంలోనే చిన్న - మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహంలో ఏపీ ముందుందని బాబు చెప్పారు. భవిష్యత్తులో 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని, అమరావతిలో ఎంఎస్‌ ఎంఈ భవన నిర్మాణానికి 15 ఎకరాల భూమిని కేటాయించినట్లుగా సీఎం తెలిపారు. పరిశ్రమల్లో తనిఖీలు అన్ని శాఖలతో ఒకేసారి జరిగేలా నూతన విధానాన్ని ప్రవేశ పెడతామని ఆయ‌న ప్ర‌క‌టించారు. రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా మార్చి సంపద సృష్టికి నిలయంగా మారుస్తామని సీఎం చంద్ర‌బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు.

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు బ్యాంకులు రుణాలివ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. పొందిన రుణాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ వినూత్న ఉత్ప‌త్తులు - నాణ్యమైన సేవ‌ల ద్వారా వినియోగ‌దారుల మ‌న‌సులు గెలుచుకోవాల‌ని పారిశ్రామికవేత్త‌ల‌కు చంద్ర‌బాబు హిత‌బోధ చేశారు. సాంకేతిక సాయంతో పారిశ్రామిక వేత్తలు స్వయంగా మార్కెటింగ్‌ చేసుకోవచ్చునని ఆయ‌న సూచించారు. టెక్నాల‌జీ విష‌యంలో నూత‌న పోక‌డల‌ను అందిపుచ్చుకోవ‌డం ద్వారా వ్యాపార‌రంగంలో వేగంగా ముందుకు పోవ‌చ్చున‌ని సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/