Begin typing your search above and press return to search.

నాయుడి గారి డౌట్!... ఏపీలో రాష్ట్రప‌తి పాల‌న‌?

By:  Tupaki Desk   |   21 Jan 2019 8:22 AM GMT
నాయుడి గారి డౌట్!... ఏపీలో రాష్ట్రప‌తి పాల‌న‌?
X
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు ఇప్పుడు నిజంగానే పెద్ద డౌటు వ‌చ్చేసింది. ఏపీలో తాను సాగిస్తున్న పాల‌న కార‌ణంగానే ఈ త‌ర‌హా డౌటు వ‌చ్చిన‌ట్టుగా కూడా ఆయ‌నకు ఈ డౌటు వ‌చ్చింద‌ట‌. ఆ డౌట‌నుమానం ఏమంటే... త‌న పాల‌న‌లోని ఏపీలో కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు రాష్ట్రప‌తి పాల‌న‌న‌ను విధించేందుకు ప‌క్కాగా పావులు క‌దుపుతోంద‌ట‌. అయినా ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఈ త‌ర‌హా డౌట్ల‌ను బ‌య‌ట పెట్టేసుకుని ప్ర‌జ‌ల్లో సానుభూతిని ప్రోది చేసుకుని మ‌రోమారు సీఎం గ‌ద్దెనెక్కేద్దామ‌న్న ఓ మ‌హా ప్ర‌ణాళిక‌కు ఆయ‌న రూప‌క‌ల్ప‌న చేస్తున్నార‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. అయినా ఈ త‌ర‌హా డౌటు ఆయ‌న‌కు ఎందుకు వ‌చ్చింద‌న్న విష‌యానికి వ‌స్తే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో బీజేపీతోనే జ‌ట్టుక‌ట్టి... జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం పుణ్యమా అని అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్ర‌బాబు.. నాలుగేళ్ల పాటు బీజేపీతోనే చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిరిగారు.

తీరా ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఏపీకి కేంద్రం నుంచి ఇసుమంతైనా మేలు చేయించ‌లేక‌పోయాన‌ని, ఈ కార‌ణంగా త‌న‌ను ఏపీ ప్ర‌జ‌లు ఎన్నిక‌ల్లో గ‌ల్లంతు చేసేస్తార‌న్న భ‌యంతో బీజేపీకి విడాకులు ఇచ్చేసిన బాబు... అప్ప‌టిదాకా తాను స్నేహం చేసిన బీజేపీపైనే క‌త్తులు దూశారు. ఏపీకి జ‌రిగిన అన్యాయమంతా త‌న చేత‌గానిత‌నం, లోపాయికారి ఒప్పందాల వ‌ల్లేన‌న్న నిజాన్ని మ‌రుగున ప‌డేసేందుకు ప‌క్కాగానే వ్యూహం ర‌చించిన చంద్రబాబు... ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తోంద‌ని స‌రికొత్త‌గా గ‌ళం వినిపించారు. ఇందులో భాగంగా అప్ప‌టిదాకా తాను చెప్పిన విష‌యాల‌నే మార్చేసి చెబుతూ... మాట మార్చ‌డంలో త‌నంతటి వాడు లేడ‌ని కూడా బాబు నిరూపించేసుకున్నారు. ఈ క్ర‌మంలో కేంద్రంపై ఆషామాషీ పోరాటం చేయ‌డం లేద‌న్నవిష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి పంపేందుకు... కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను రాష్ట్రంలోకి రానిచ్చేది లేదంటూ బీష్మించారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వ అనుమ‌తి లేనిదే సీబీఐ ఏపీ ప‌రిధిలోకి అడుగుపెట్ట‌రాదంటూ ఓ జీవోను జారీ చేశారు.

ఆ త‌ర్వాత వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కేసు ద‌ర్యాప్తును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు ఎలా అప్ప‌గిస్తారంటూ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. స్వ‌యంగా ఏపీ హైకోర్టు ఆదేశాల మేర‌కే ఎన్ఐఏ ఈ కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌లు చేప‌ట్టినా... ఈ విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకోని చంద్ర‌బాబు... కేంద్రం ఆదేశాల‌తోనే ఆ సంస్థ ఈ కేసు ద‌ర్యాప్తును స్వీక‌రించింద‌ని కూడా బాబు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోకి ప్ర‌వేశించిన ఎన్ఐఏను త‌క్ష‌ణ‌మే వెన‌క్కు పంపేయాలంటూ బాబు స‌ర్కారు హైకోర్టుకు ఎక్కినా... శ‌నివారం నాడు హైకోర్టు అందుకు స‌సేమిరా అంది. తాత్కాలిక ఉత్త‌ర్వులు అయినా తెచ్చుకుందామ‌న్న చంద్ర‌బాబు య‌త్నాల‌ను ప‌సిగ‌ట్టిన కోర్టు... ఈ కేసును హౌస్ మోష‌న్ పిటిష‌న్ కింద విచార‌ణ చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఎంత‌మాత్రం లేదంటూ తిప్పికొట్టింది.

అయినా కూడా వెన‌క్కు త‌గ్గ‌ని బాబు స‌ర్కారు అదే పిటిష‌న్‌ను రెగ్యుల‌ర్ పిటిష‌న్‌గా స్వీక‌రించ‌వ‌ల‌సిందిగా కోరి... కోర్టులో ఆ పిటిష‌న్ అలాగే ఉండేలా చేసుకున్నారు. అయితే కాసేప‌టి క్రితం ఈ పిటిష‌న్‌పైనా విచార‌ణ చేప‌ట్టిన కోర్టు... బాబు స‌ర్కారు అభ్య‌ర్థ‌న‌ను తిప్పికొట్టింది. జ‌గ‌న్ కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌ల నుంచి ఎన్ఐఏను త‌ప్పించ‌డం కుద‌ర‌ద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. ఈ క్ర‌మంలో డ్రామాను మ‌రింత ర‌క్తి క‌ట్టించాల‌న్న ఉద్దేశంతో ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న విధించే ప్ర‌మాదం లేక‌పోలేదంటూ కొత్త రాగం అందుకున్నారు. కేంద్రం చ‌ర్య‌ల‌ను త‌ప్పుబ‌డుతున్న కార‌ణంగానే రాష్ట్రంపై క‌క్ష గ‌ట్టిన మోదీ స‌ర్కారు... త‌న‌నేమీ చేయ‌లేక త‌న చేతిలోని రాష్ట్రప‌తి పాల‌న అస్త్రాన్ని సంధిస్తోంద‌ని కూడా బాబు గ‌గ్గోలు పెడుతున్నారు. కేంద్రం మదిలో ఏముందో తెలియ‌దు గానీ... ఎన్నిక‌లు స‌మీపిస్తున్న ప్ర‌స్తుత కీల‌క త‌రుణంలో కేంద్రం అలాంటి నిర్ణ‌యం తీసుకునే సాహ‌సం చేయ‌ద‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.