Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు షాక్.. ఈసీ కఠిన నిర్ణయం..

By:  Tupaki Desk   |   17 April 2019 4:47 AM GMT
చంద్రబాబుకు షాక్.. ఈసీ కఠిన నిర్ణయం..
X
ఎన్నికల్లో ఈవీఎంల అక్రమాలు జరిగాయని.. దేశరాజధాని ఢిల్లీకి వచ్చి నానా యాగీ చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు జలక్ ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ రెడీ అయినట్టు సమాచారం. పోలింగ్ రోజున ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు అక్కడే ధర్నా చేసి ఈసీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ విమర్శలను ఆంగ్లం లేదా హిందీలోకి తర్జుమా చేసి పంపించాలని ఈసీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదిని ఆదేశించడం రాజకీయంగా సంచలనంగా మారింది.

పోలింగ్ రోజున చంద్రబాబు ఈసీపై ఎమన్నారు? ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి ఎలాంటి విమర్శలు చేశారో పంపించాలని తాజాగా ఏపీ ఎన్నికల అధికారికి ఈసీ లేఖ రాసింది. అందుకు సంబంధించిన వీడియో, వాయిస్ రికార్డులను సైతం పంపాలని ఆదేశించింది.

ఈనెల 11న పోలింగ్ జరిగిన రోజు చంద్రబాబు ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి ద్వివేదిని కలిసి అక్కడే నిరసన వ్యక్తం చేశారు. ఈ వివరాలను అప్పుడే ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. అయితే తగిన సాక్ష్యాధారాలతో వివరాలను పంపించాలని ఈసీ తాజాగా ఆదేశించింది.

ఇదే క్రమంలో టీడీపీ చేసిన ఫిర్యాదు, వాస్తవ పరిస్థితులపై కూడా సమగ్ర వివరాలు పంపాలని ఈసీ సూచించింది. పోలింగ్ రోజున ఓటర్లను ప్రభావితం చేసేలా బాబు ప్రయత్నించాడని ఈసీ భావిస్తోంది. అందుకే చంద్రబాబుపై చర్యలు తీసుకునేందుకు ఇలా నివేదిక కోరినట్టు సమాచారం.