Begin typing your search above and press return to search.

బాబు ప్రచార సభలోనే ఝలక్ ఇచ్చిన టీడీపీ నేత!

By:  Tupaki Desk   |   24 March 2019 6:01 PM GMT
బాబు ప్రచార సభలోనే ఝలక్ ఇచ్చిన టీడీపీ నేత!
X
ఒకవైపు ఎన్నికల ముందు ‘పసుపు కుంకుమ’ కార్యక్రమాన్ని హైలెట్ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. డ్వాక్రా మహిళలకు దీని ద్వారా లబ్ధి కలుగుతూ ఉందని, చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు పెద్దన్నగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టుగా తెలుగుదేశం ప్రచారం చేసుకొంటూ ఉంది. అయితే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల ముందు చెప్పింది డ్వాక్రా రుణమాఫీ. అది చేయలేదు. తీరా ఎన్నికల ముందు ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి.

అయితే ఈ కార్యక్రమం గురించి క్షేత్ర స్థాయిలో రకరకాల ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. ఇదంతా పావల వడ్డీ లో భాగమైన డబ్బు అని.. తమకు న్యాయంగా దక్కాల్సిన డబ్బునే చంద్రబాబు నాయుడు ఇలా ఇస్తూ ఉన్నారని కొంతమంది మహిళలు ఓపెన్ గా చెబుతున్నారు. డ్వాక్రా మహిళలతో ముందుగా రూపాయి వడ్డీతో రుణాలను వసూలు చేయడం, తర్వాత పావల వడ్డీ పోనూ.. మిగతా సొమ్మును వారి ఖాతాల్లోకి వేయడం వైఎస్ కాలం నుంచి మొదలైంది. అయితే ఆ పావలా వడ్డీలో భాగంగా మహిళలకు చెల్లించాల్సిన డబ్బునే ఇలా పసుపు కుంకుమ పేరుతో ఇస్తున్నారని మహిళలు చెబుతూ ఉన్నారు.

ఆ సంగతలా ఉంటే.. కడప జిల్లా రాయచోటి సభలో మాజీ ఎమ్మెల్యే పాల కొండ్రాయుడు ఈ అంశం గురించి మాట్లాడిన వైనం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభలోనే పాలకొండ్రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పసుపు కుంకుమ ప్రోగ్రామ్ మంచిదే అని అంటూనే..అందులో అక్రమాలు జరుగుతూ ఉన్నాయని ఆయన అన్నారు. ఆ ప్రోగ్రామ్ కు సంబంధించిన డబ్బులు మహిళలకు సవ్యంగా అందడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కొంతమంది డ్వాక్రా మహిళల పేర్లను తొలగించి, అనుచితంగా వేరే వాళ్ల పేర్లు ఎక్కించి వారికి లబ్ధి కలిగిస్తూ ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభలోనే ఆ మాజీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మొదటే ఆయనను చంద్రబాబు నాయుడు వారించారు. ఆ తర్వాత పేపర్ల లీకేజీ అంటూ పాలకొండ్రాయుడు మరో విషయాన్ని చెప్పబోయాడు. అయితే ఆయనను తెలుగుదేశం నేతలు వారించి పక్కకు తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం, ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రామ్ విషయంలో ఇలాంటి అభిప్రాయాలు వినిపించడం విడ్డూరమే!