ఓర్నాయనో.. ఆ క్రెడిట్ కూడా బాబుదేనట

Sun Jan 14 2018 11:40:16 GMT+0530 (IST)

తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగినా.. ఆ క్రెడిట్ మాత్రం ఏపీ ముఖ్యమంత్రి తీసేసుకుంటారు. అలా అని అన్నింటికి కాదు సుమా. మంచికి మాత్రమే. ప్రతిదీ తన వల్లే జరిగిందని తరచూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. సంక్రాంతి పండగ విషయంలోనూ క్రెడిట్ తీసేసుకొని అందరిని అశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇంతకీ సంక్రాంతి పండగలో బాబు క్రెడిట్ తీసుకోవాల్సిన విషయం ఏముందంటారా? అక్కడికే వస్తున్నాం.సంక్రాంతి పండక్కి సొంతూరుకు వెళ్లే అలవాటు చాలామందిలో కనిపిస్తుంది. ఈ అలవాటే.. ఈ రోజు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు భారీ ఎత్తున పయనమవుతున్నారు. అయితే.. ఆ అలవాటు తమ నుంచే మొదలైందని చెబుతున్నారు చంద్రబాబు. సంక్రాంతికి సొంతూర్లకు వచ్చే సంప్రదాయాన్ని తామే మొదలెట్టామని చంద్రబాబు చెబుతున్నారు.

శనివారం తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా తన సతీమణి భువనేశ్వరి.. ఈ సంప్రదాయాన్ని మొదలు పెట్టారన్నారు. గడిచిన కొన్నాళ్లుగా తమ సొంతూరు నారావారి పల్లెకు సంక్రాంతి సందర్భంగా రావటం మొదలై.. ఇప్పుడది ఆనవాయితీగా మారిందని చెప్పారు.

తమ స్ఫూర్తితోనే ఇప్పుడు తెలుగువారంతా తమ సొంత గ్రామాలకు  వస్తున్నారని.. ఇది చాలామంచి పరిణామంగా చంద్రబాబు అభివర్ణించారు. ఉద్యోగ.. వ్యాపారాల కారణంగా పట్టణాల్లో..నగరాల్లో.. విదేశాల్లో స్థిరపడిన వారంతా సంక్రాంతి పండక్కి సొంతూరుకువస్తున్నారన్నారు. వామ్మో.. వామ్మో.. తెలుగు నేల మీద ఎవరేం చేసినా.. అంతా చంద్రబాబు పుణ్యమేమో? ఈ లెక్కన సంక్రాంతి పండక్కి ఇళ్లల్లో వండుకునే పిండివంటలు.. ఇంటి బయట వేసే ముగ్గులు కూడా.. ఎప్పుడో ఒకప్పుడు బాబు పూర్వీకులు మొదలు పెట్టి ఉంటారు. దాన్ని  స్ఫూర్తిగా తీసుకొని తెలుగువారు చేయటం మొదలు పెట్టి ఉంటారేమో..?