Begin typing your search above and press return to search.

రికార్డ్ బ్రేక్ చేయ‌నున్న‌ చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   27 Nov 2015 7:54 PM GMT
రికార్డ్ బ్రేక్ చేయ‌నున్న‌ చంద్ర‌బాబు
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్ధ‌మైపోయారు! ఎప్ప‌ట్నుంచో త‌న ఖాతాలో ఉన్న రికార్డును తాజాగా ఆయ‌న ఉన్న‌తాధికారుల స‌మ‌క్షంలో బ్రేక్ చేయ‌నున్నారు. ఇంత‌కీ ఆ రికార్డు ఏంటంటే... హైదరాబాద్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సచివాలయానికి చంద్ర‌బాబు వచ్చి ఇప్పటికి దాదాపు మూడు నెల‌లు పూర్తికావ‌స్తోంది. సెప్టెంబర్‌ ఐదున జరిగిన మంత్రివర్గ భేటీ తరువాత మళ్లీ ఆయన సచివాలయానికి రాలేదు. ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్‌ నాలుగో తేదీ వరకు జరిగిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రతి రోజూ సచివాలయానికి వచ్చారు. అసెంబ్లీ ముగిసిన‌ వెంటనే ఐదో తేదీన మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. అదే చివరిగా చంద్ర‌బాబు సచివాలయానికి రావడం.

దాదాపు మూడు నెలల తర్వాత హైదరాబాద్‌లోని సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నారు. వివిధ అంశాలపై మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న సంద‌ర్భంగా ఆయ‌న స‌చివాలయానికి విచ్చేయ‌నున్నారు. ఏపీ ప‌రిపాల‌న‌ను చంద్రబాబునాయుడు విజయవాడకు మార్చిన దరిమిలా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంత‌రించుకుంది. 150 ప్రభుత్వశాఖలు, 33 కార్యదర్శుల కార్యస్థానాలు, 20 మంత్రిత్వశాఖలు, ఇంకా, వివిధస్థాయిలలోస్థానికపరిపాలన సంస్థల నుంచి ముఖ్యమంత్రి ఎటువంటి ఫలితాలు, ప్రగతిని ఆశిస్తున్నారో ఈ సమావేశంలో నిర్ధిష్టమైన కార్యాచరణను ప్రకటించనున్న‌ట్లు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే ప్రధానమైన 12 ప్రభుత్వశాఖలు ఈ సమావేశంలో ప్రెజెంటేషన్స్ ఇవ్వనున్నాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు పూర్తిస్థాయి రోడ్ కనెక్టివిటీ, నీటి వనరుల సంరక్షణ, ప్రతి ఇంటికి టాయిలెట్ల నిర్మాణం, ఎల్ఈడీ బల్బుల విస్తృత వాడకం గురించి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో లక్ష్యాలను నిర్దేశించనున్నారు. రానున్న 2, 3 ఏళ్లలో అన్ని గ్రామాలలో అంతర్గత రహదారి వ్యవస్థను పటిష్టంగా నిర్మించాలన్నది ప్రభుత్వ సంకల్పం. మొత్తం 60 లక్షల టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలన్న లక్ష్యాన్ని వచ్చే నాలుగేళ్లలో పూర్తిచేయడం, ప్రతి వ్యక్తి కనీసం 8 మొక్కలునాటాలన్న లక్ష్యాన్నిఎలా సాధించాలన్న అంశంపై కార్యాచరణ నిర్ణయిస్తారు. అలాగే, ఇప్పటికే 659 గ్రామాలలో చేపట్టిన ఘన వ్యర్ధాల నిర్వహణను రానున్న 4ఏళ్లలో మొత్తం 2వేల గ్రామాలకు ఎలా విస్తారించాలన్న అంశంపై చర్చ జరుగుతుంది. ఇలా ఒక్కొక్క శాఖకు లక్ష్యాలను ఏర్పర్చి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు.

మొత్తంగా ఈ మేధోమధనంలో వచ్చే నెలలో జరగనున్న కలెక్టర్ల సదస్సుకు పూర్వరంగాన్ని సిద్ధంచేస్తారు. ఏఏ జిల్లాలో ఎటువంటి పనులు మిగిలివున్నాయో, ఎటువంటి లక్ష్యాలను పూర్తిచేయాల్సివుందో నిర్ణయిస్తారు. ఇక్కడ జరిగే ప్రతి చర్చ, సారాంశంపై కార్యాచరణ ప్రణాళికలను తయారుచేసి క్షేత్రస్థాయిలో వాటిని సంపూర్ణంగా అమలయ్యేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన. ఇంత పెద్ద ల‌క్ష్యంతో చంద్ర‌బాబు తిరిగి ఉమ్మ‌డి రాజ‌ధానిలోని స‌చివాలయానికి రానున్నారు.