Begin typing your search above and press return to search.

రఘువీర రుణం చెల్లించుకుంటున్న చంద్రబాబు?

By:  Tupaki Desk   |   24 March 2019 5:07 AM GMT
రఘువీర రుణం చెల్లించుకుంటున్న చంద్రబాబు?
X
ఏపీలో కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీల బంధం ఏమిటో వివరించనక్కర్లేదు. తమ లక్ష్యం చంద్రబాబు నాయుడు కాదు అని ఇది వరకే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడును తాము లక్ష్యంగా చేసుకోవడం లేదని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందంటే అంతకన్నా వీళ్ల బంధం గురించి వేరే రుజువులు అక్కర్లేదు. ఇక కాంగ్రెస్- టీడీపీల బంధం గురించి తెలుగుదేశం అనుకూల మీడియా కూడా నొక్కి వక్కాణించింది.

ఏపీ కాంగ్రెస్ ను రాహుల్ గాంధీ పూర్తిగా చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారని, తెలుగుదేశం ప్రయోజనాలకు అనుగుణంగా టీడీపీ, కాంగ్రెస్ లు ఏపీలో కలిసి పోటీ చేయడమా, వేర్వేరుగానా అనేది బాబే నిర్ణయించుకోవాలని రాహుల్ ఆఫర్ ఇచ్చినట్టుగా టీడీపీ అనుకూల మీడియానే స్పష్టం చేసింది. కేంద్రంలో చంద్రబాబు నాయుడు తమకు మద్దతును ఇస్తారనే లెక్కతో కాంగ్రెస్ ఇలా చేస్తోందనే విశ్లేషణలు వినిపించాయి.

ఇలాంటి నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీకి కూడా కొద్దో గొప్పో సాయం చేస్తున్నారట చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ ప్రచారం సాగుతూ ఉంది. ప్రత్యేకించి ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని అసెంబ్లీకి పంపించేందుకు చంద్రబాబు నాయుడు సహకారం అందిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతోంది.

రఘువీరారెడ్డి కల్యాణదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో అక్కడ బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించడం ద్వారా బాబు సాయం చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రఘువీరారెడ్డి కి పోటీగా మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు అనే వ్యక్తిని పోటీకి నిలిపారు బాబు. కల్యాణదుర్గంలో ఆయనకు పెద్దగా గుర్తింపు కూడా లేదు.

వాస్తవానికి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఉన్నారు. కమ్మ వాళ్ల జనాభా, బీసీ జనాభా ఉన్న నియోజకవర్గం అది. టీడీపీకి అనుకూలంగానే పరిస్థితులున్నాయి. వైసీపీ కూడా బలమైన అభ్యర్థిని రెడీ చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు… రఘువీరారెడ్డికి సహకారం అందిస్తున్నారని..ప్రచారం జరుగుతోంది.

మరోవైపు తనకు టికెట్ దక్కకపోవడంపై అసహనంతో ఉన్న హనుమంతరాయ చౌదరి ఇండిపెండెంట్ గా అక్కడ బరిలోకి నిలిచారు. ఆయనను పోటీ నుంచి విరమింపజేయడానికి టీడీపీ కసరత్తు సాగుతూ ఉందట. ఏదేమైనా రఘువీర కోసం చంద్రబాబు నాయుడు టీడీపీని కల్యాణదుర్గంలో వీక్ చేస్తున్నారనే విశ్లేషణ మాత్రం బలంగా వినిపిస్తోంది!