చాందినిని హత్య చేసింది అతడేనట

Wed Sep 13 2017 10:33:58 GMT+0530 (IST)

నగరంలోని పేరున్న స్కూళ్లల్లో ఒకటైన స్కూల్లో ప్లస్ టు చదువుతున్న చాందిని జైన్ (17) హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. తీవ్ర సంచలనం రేపిన చాందిని హత్య వెనుక ఉన్నది ఎవరన్నది ఇప్పుడు పోలీసులు బయటపెట్టారు. షాకింగ్ గా అనిపించే ఈ ఉదంతంలో ఊహించని ట్విస్టులు బోలెడన్ని ఉన్నట్లుగా చెబుతున్నారు.మైనర్ అయిన చాందినికి తన స్కూల్ మేట్ (మియాపూర్ దగ్గర్లోని బాచుపల్లిలోని సిల్వర్ ఓక్స్ స్కూల్).. ప్రియుడు అయిన డిగ్రీ విద్యార్థి సాయికిరణ్ రెడ్డి హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. మూడు రోజుల పాటు కనిపించకుండా పోయిన చాందిని మృతదేహాన్ని నిన్న (మంగళవారం) సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ గుట్టల్లో మరణించిన స్థితిలో గుర్తించారు.

సీసీ కెమేరాల ఫుటేజ్ లో చాందిని మరో యువకుడితో వెళ్లిన వైనాన్ని పసిగట్టిన పోలీసులు.. తమ దగ్గరి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి నిందితుడ్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. చాందినిని హత్య చేసిన నిందితుడు సాయికిరణ్ మదీనాగూడలోని అపార్ట్ మెంట్లో ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తనను పెళ్లి చేసుకోవాలని చాందిని ఒత్తిడి చేయటంతో ఆమెను సాయికిరణ్ హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ మధ్యాహ్నం నిందితుడు సాయికిరణ్ ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. చాందిని మృతదేహాన్ని చూసినప్పుడు ప్రాధమికంగా ఆమె అత్యాచారం చేసి.. తర్వాత హత్య చేసి ఉండొచ్చని భావించారు. అయితే.. మంగళవారం రాత్రి చాందిని స్నేహితులు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అదే సమయంలో కొందరు అనుమానితుల్ని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చాందినిని సాయికిరణ్ హత్య చేసి ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చారు. అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. చాందినిని హత్యకు తానే కారణంగా సాయికిరణ్ ఒప్పుకున్నట్లుగా సమాచారం.ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.