Begin typing your search above and press return to search.

కొత్త వరాలు మున్ముందుగా నంద్యాలకే!

By:  Tupaki Desk   |   25 July 2017 8:37 AM GMT
కొత్త వరాలు మున్ముందుగా నంద్యాలకే!
X
‘చంద్రబాబునాయుడు అసలు అభివృద్ధి చేయనే చేయరు’ అని సాధారణంగా ఎవ్వరూ అనరు! కాకపోతే... ఆయనలో ఉన్న లోపం.. తాను చేసే ఒకటీ అరా అభివృద్ధి మొత్తాన్నీ ఒకేచోట కేంద్రీకృతంగా చేస్తుంటారు. గతంలో తొమ్మిదేళ్ల ఏలుబడి సాగినప్పుడు కూడా ఆయన తెలుగు రాష్ట్రానికి చేసిన ద్రోహం అదే. చేపట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్నీ హైదరాబాదులో మాత్రమే కేంద్రీకరించారు. ఆ ఒక్క నగరమూ అద్భుతమైనదిగా తయారైంది. మిగిలిన యావత్ రాష్ట్రమూ దాన్ని చూసి ఆశ పడింది.. అసూయ పడింది. అలాగే రాష్ట్ర విభజన అనే ఆలోచన పుట్టడానికి అదే కారణమైంది. అదొక్కటీ ఉమ్మడిగా ఉంటే చాలు.. రాష్ట్రం చీలిపోయినా పర్లేదు అనే వాదనకూ అదే కారణమైంది. ఇలా సమతుల్య అభివృద్ధి అనే మాట తెలియని చంద్రబాబు పని తీరువల్ల తలెత్తిన పరిణామాలు ఇవి!

ఇప్పుడు కొత్త గా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. ప్రతిసారీ.. నేను అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తున్నాను అంటూ జనాంతికంగా అంటూనే ఉన్నారు గానీ.. నిజానికి పట్టించుకుంటున్నది అమరావతిని మాత్రమే. అయితే తాజాగా ఆయన మరో నగరం మీద కూడా ప్రేమ కురిపిస్తున్నారు. అది మరేంటో కాదు... ఉప ఎన్నికల రంగస్థలంగా ముస్తాబవుతున్న నంద్యాల.

తాజాగా ప్రభుత్వం రాష్ట్రంవ్యాప్తంగా రెండు వందల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే.. తక్షణం కొన్ని ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు. ఈ తక్షణం ప్రారంభించేవి మాత్రం విజయవాడ - మంగళగిరి - నంద్యాలల్లో ఒకటి రెండు రోజుల్లోనే ఏర్పాటు కావాలిట. నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడం అనేది రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. నేడో రేపో నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనే పరిస్థితి ఉంది. ఎన్ని రకాల పథకాల్ని అక్కడ గంపగుత్తగా కుమ్మరించగలిగితే.. అంతగా చేసేసి.. ఎలాగోలా ఓట్లు పిండుకుని.. ఎన్నికల గండం నుంచి గట్టెక్కాలని తెలుగుదేశం నానా పాట్లు పడుతోంది. ఇలాంటి అన్న క్యాంటీన్ల ఎర కూడా వేస్తున్నట్లు స్పష్టంగానే అర్థమవుతోంది. కాకపోతే.. ఒక్క నంద్యాలలోనే ప్రారంభిస్తే.. విమర్శలు వస్తాయి గనుక.. ‘తొలివిడత’ అనే ముసుగు వేసి విజయవాడ - మంగళగిరితో పాటు నంద్యాలలో ఏర్పాటు చేయించడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లోపే నంద్యాలకు మరిన్ని వరాల ప్రారంభం కూడా జరగవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.