Begin typing your search above and press return to search.

వైసీపీ వేధింపులే కోడెలను చంపేశాయి: చంద్రబాబు

By:  Tupaki Desk   |   16 Sep 2019 12:18 PM GMT
వైసీపీ వేధింపులే కోడెలను చంపేశాయి: చంద్రబాబు
X
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల ప్రసాద్ మృతికి వైసీపీయే కారణమని ఏపీ మాజీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ వేధింపుల కారణంగానే ఆయన మరణించారని... వైసీపీ ప్రబుత్వం చేసిన అవమానాలు, కేసులను ఆయన తట్టుకోలేకపోయారన్నారు. కోడెల కుటుంబంపై అనేక కేసులు పెట్టారన్నారు చంద్రబాబు. ఇవన్నీ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు అన్నారు.

కోడెల మృతి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని.. వ్యక్తిగతంగా మంచి స్నేహితుడిని కోల్పోయానని చంద్రబాబు అన్నారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోడెల శివప్రసాద్ కు నివాళులర్పించిన చంద్రబాబు... ఒక సహచరుడిని కోల్పోయిన బాధ, సీనియర్ నేతను కోల్పోయిన బాధను భరించలేకపోతున్నానని, ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల శివప్రసాద్ మానసిక క్షోభకు, భరించలేని అవమానానికి గురయ్యారని, తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు.

నందమూరి బాలకృష్ణ తనకు ఫోన్ చేసి కోడెల మృతి వార్తను చెప్పడంతో షాక్ కు గురయ్యానని, ‘చాలా బాధ కలిగింది, మనసు కలచివేస్తోందని చంద్రబాబు అన్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు - మాజీ మంత్రులు యనమల - సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి - ఇతర మాజీ మంత్రులు - ఎంపీలు - ఇతర నేతలు కూడా ఇది వైసీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే జరిగిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు కోడెలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టారని.. ఏకంగా 23 కేసులు పెట్టి వేధించారని.. అవమానించారని.. వీటన్నిటి నేపథ్యంలో ఆయన అవమాన భారంతో - మనో ధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.