బీజేపీపై వైరం..ఇలా అయితే కేసీఆర్ ప్రధాని కావచ్చు..

Wed May 16 2018 11:00:55 GMT+0530 (IST)

కర్ణాటక ఫలితం తేలింది. హంగ్ ఏర్పడింది.. ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. బీజేపీ విజయం అంచుల వరకు వచ్చి బోర్లపడింది. గద్దెనెక్కేందుకు తెరవెనుక గవర్నర్ ద్వారా బీజేపీ పావులు కదుపుతోంది. జేడీఎస్ ను చీల్చడానికి ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలు ఆసక్తిగా మారాయి.బీజేపీ ఎత్తులను కాంగ్రెస్ అధినేత్రి సోనియా పసిగట్టింది. మేఘాలయ - గోవాలో ఇలానే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా తక్కువ సీట్లు పొందిన బీజేపీ మిత్రపక్షాలతో కలిసి ఆయా రాష్ట్రాలను చేజిక్కించుకుంది. దీంతో మేలుకున్న కాంగ్రెస్ పెద్దలు వెంటనే కర్ణాటకలో వాలారు..

నిజానికి కాంగ్రెస్ కు కర్ణాటక ఎన్నికల్లో 78 సీట్లు వచ్చాయి. రెండో అతిపెద్ద పార్టీ. అదే జేడీఎస్ కు 38 సీట్లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి జేడీఎస్ పొత్తుతో కాంగ్రెస్ గద్దెనెక్కాలి. కానీ బీజేపీని ఎలాగైనా అధికారంలోకి రానీయవద్దనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా పంతం ముందు అధికారాన్ని కూడా కాంగ్రెస్ వదులుకుంది. తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ కు అధికారాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యింది. 38 సీట్లే సాధించిన జేడీఎస్ కుమారస్వామిని సీఎం చేయడానికి కాంగ్రెస్ నిర్ణయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీన్ని బట్టి తమ నావ మునిగినా సరే.. బీజేపీని ముంచాలన్న కసి కాంగ్రెస్ లో కనిపించింది. సోనియా దగ్గరుండి మరీ గులాంనబీ సహా ఇతర కాంగ్రెస్ పెద్దలను కర్ణాటక పంపి ఇవన్నీ చక్కబెట్టించిందట..

ఇలా మోడీపై కోపంతో కాంగ్రెస్ కర్ణాటకను బీజేపీకి అప్పగించడానికి సిద్ధంగా లేదు. అందుకే జేడీఎస్ కు భేషరతుగా మద్దతు తెలిపింది. ఒకవేళ 2019 ఎన్నికల్లో దేశంలో ఇదే పరిస్థితి ఏర్పడితే.. అప్పుడు కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ తక్కవ సీట్లు సాధిస్తే పరిస్థితి పునరావృతం అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. అప్పుడూ కాంగ్రెస్ ఇలాంటి అడుగులే వేస్తే కేసీఆర్ కు అదృష్టం వరించినట్టే.. కర్ణాటక తరహాలోనే కేసీఆర్ ప్రధాని కావచ్చు.

కాంగ్రెస్ స్ట్రాటజీ చూస్తే బీజేపీని గద్దెనెక్కకుండా ఏం చేయడానికైనా రెడీ అయ్యింది. ఈ మార్పు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగితే తెలుగు రాష్ట్రాల నుంచి రెండో ప్రధానిగా కేసీఆర్ కావడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ కర్ణాటక పరిణామాలు 2019లో రిపీట్ అయితేనే ఇదంతా జరుగుతుంది.. లేకుంటే అవన్నీ కలగానే మిగిలిపోతాయి.. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..