Begin typing your search above and press return to search.

బీహార్‌ లో తేడా వస్తే నితీశ్‌ కు భాజపా మద్దతు!

By:  Tupaki Desk   |   8 Oct 2015 9:55 AM GMT
బీహార్‌ లో తేడా వస్తే నితీశ్‌ కు భాజపా మద్దతు!
X
ఒకవైపు వారు ఎన్నికల రణరంగంలో పరస్పరం కత్తులు దూసుకుంటూ ఉండగా.. నితీశ్‌ కు భవిష్యత్తులో భాజపా మద్దతిచ్చి గద్దెపై కూర్చోబెట్టే అవకాశం కొట్టిపారేయలేం అంటూ సాగే ఇలాంటి ఊహాగానాలు వింటే ఎవరైనా సరే మొహాన నవ్వి పోతారు. కానీ బీహార్‌ లోని రాజకీయ విశ్లేషకులు మాత్రం.. ఇలాంటి అవకాశం కూడా ఉన్నదనే వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగంటే...

- సార్వత్రిక ఎన్నికల్లో మోడీ హవా ఎంతగా కనిపించినప్పటికీ.. ఆ తర్వాత జరుగుతూ వస్తున్న రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ ప్రభావం అంత ముమ్మరంగా ఇప్పటివరకూ పెద్దగా కనిపించలేదు.

- మహారాష్ట్ర - కాశ్మీర్‌ - ఢిల్లీ ఎన్నికల విషయాలను పరిశీలిస్తే ప్రతి రాష్ట్రంలోనూ చాలా డాంబికంగానే భాజపా ఎన్నికలకు దిగింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి చోటా చతికిలపడినట్లే.

- మహారాష్ట్రలో పాతికేళ్ల అనుబంధాన్ని పాతరవేసి.. శివసేనతో తెగతెంపులు చేసుకున్న భాజపా.. ఎన్నికలు కాగానే.. ప్రభుత్వం ఏర్పాటులో చేతకాక, చేతులెత్తేసి, తిరిగి శివసేన కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది.

- జమ్మూ కాశ్మీర్‌ లో కాసిని సీట్లు తమకు రాగానే ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె మీద కూర్చోవాలనే వ్యామోహంలో పార్టీ సిద్ధాంతాలు, కొన్ని దశాబ్దాలుగా పార్టీ నమ్ముకున్న విలువలు అన్నిటినీ తుంగలో తొక్కేసి.. అక్కడ ఎన్సీతో కలిసి అధికారం పంచుకున్నారు. పార్టీ విలువలు అన్నీ గంగలో కలిపేసుకున్నారు.

ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం...

ఇప్పుడు బీహార్‌ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్నారు. కానీ ఏకపక్షంగా భాజపా నెగ్గుతుందనే నమ్మకం ఆ పార్టీ వారికి కూడా లేదు. నితీశ్‌ కుమార్‌ మంచిముఖ్యమంత్రిగా ఎంత పేరున్నదంటే.. ఆయన మీద ఎక్కువ విమర్శలను ఫోకస్‌ చేస్తే తమకు పడే ఓట్లు కూడా పడవేమో అని భాజపా భయపడే పరిస్థితి! ఎంతసేపూ లాలూ - కాంగ్రెస్‌ ల మీదనే భాజపా నాయకుల విమర్శలు ఉంటున్నాయి. ఆ జట్టుతో కలిసి నితీశ్‌ పాలించలేడంటూ దెప్పి పొడుస్తున్నారు తప్ప నితీశ్‌ అసమర్థుడు - అవినీతి పరుడు అనలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో లౌకికకూటమిలో నితీశ్‌ పార్టీకి గరిష్టంగా సీట్లు, ఎన్డీయేలో భాజపాకు గరిష్టంగా సీట్లు వచ్చి ఎవ్వరూ (ఏ కూటమి కూడా) ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చినట్లయితే.. నితీశ్‌ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి భాజపా ఎంతమాత్రమూ సిగ్గుపడదని.. తాము అంశాలవారీ మద్దతు ఇస్తాం అనే ఒక మాయమాట ప్రకటించేసి.. అధికారాన్ని పంచుకున్నా ఆశ్చర్యం లేదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. నితీశ్‌ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచి, వారి కూటమిలోని లాలూ, కాంగ్రెస్‌ లు పోటీచేసే సీట్లలో భాజపా ఎక్కువ స్థానాలు గెలిస్తే.. ఇలాంటి వెరైటీ పరిస్థితి ఉత్పన్నం అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో వేచిచూడాలి.