Begin typing your search above and press return to search.

కేసీఆర్ సింహం..విప‌క్ష నేత‌లు పందులా చ‌ల్లా?

By:  Tupaki Desk   |   21 Sep 2018 5:31 AM GMT
కేసీఆర్ సింహం..విప‌క్ష నేత‌లు పందులా చ‌ల్లా?
X
విలువ‌లు.. గౌర‌వ మ‌ర్యాద‌ల గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిద‌న్న‌ట్లుగా ఉంది ఇప్ప‌టి రాజ‌కీయాల్ని చూస్తే.. కొంద‌రు నేత‌ల మాట‌లు చూస్తే.. రోత క‌ల‌గ‌టం ఖాయం. నిజానికి నేత‌ల్ని అనాల్సిన అవ‌స‌ర‌మే లేదు.. వారికి అరాధ్య‌నీయులుగా ఉండే అధినేత‌లు కూడా ఇలాంటి ప‌రిస్థితుల్లోనే ఉన్నారు.

ఎంత‌టి స్థానాల్లో ఉన్నా పూచిక‌పుల్ల‌ల్ని చేసిన‌ట్లుగా మాట్లాడ‌టం.. అదేమంటే సెంటిమెంట్ సెంటు బాటిల్ జేబులో నుంచి తీయ‌టం అల‌వాటుగా మారింది. దూకుడు రాజ‌కీయాల్లో ఎంతగా తిట్టి పోస్తే.. అంత‌గా పాపుల‌ర్ కావ‌టం ఈ మ‌ధ్య అంత‌కంత‌కూ ఎక్కువ‌వుతోంది. తాజాగా అలాంటి తీరునే ప్ర‌ద‌ర్శించి సంచ‌ల‌నంగా మారారు టీఆర్ ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి.

ఎన్నిక‌లు ముంచుకొచ్చిన వేళ‌.. అధికారాన్ని కాపాడుకోవ‌టం కోసం ప్ర‌త్య‌ర్థుల‌ను చుల‌క‌న చేసి మాట్లాడేలా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌కు ఒళ్లు మండేలా చేస్తున్నాయి. ఇలాంటి అహంకార ధోర‌ణికి ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెబుతార‌న్న మాట‌ను చెబుతున్నారు. ఇంత‌కీ చ‌ల్లా ధ‌ర్మారెడ్డి సాబ్ నోట్లో నుంచి వ‌చ్చిన ఆణిముత్యాల్లాంటి మాట‌ల్ని చూస్తే.. ఔరా అనిపించ‌క మాన‌దు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ సింహ‌మ‌ని.. ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు పందులంటూ చ‌ల్లా ధ‌ర్మారెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు. తాజాగా వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా గీసుకొండ మండ‌లంలో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో త‌న నోటికి అడ్డూ ఆపూ లేకుండా మాట్లాడేశారు. ప‌ర‌కాల నుంచి పోటీ చేయ‌టానికి ఎవ‌రో వ‌స్తున్నారని చెబుతున్నార‌ని.. వారికి ద‌మ్ము ధైర్యం ఉంటే ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని స‌వాలు విసిరారు.

రాజ‌కీయాలు అన్నాక స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్లు కామ‌నే. కాకుంటే.. ఇలా నోటికి వ‌చ్చిన‌ట్లుగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే అస‌లు ఇబ్బంది. ఇలాంటి వ్యాఖ్య‌ల‌తో లాభం ఎంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. న‌ష్టం మాత్రం ఎక్కువ అంటున్నారు. క‌నీస మ‌ర్యాద లేకుండా మాట్లాడే నేత‌ల్లో అధికారం త‌ల‌కెక్కిన వైనం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌న్న భావ‌న క‌నిపించ‌క మాన‌దు.

ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు పార్టీ నేత‌ల నోటి నుంచి రాకుండా ఉండేలా కేసీఆర్ చెబితే బాగుంటుంద‌న్న సూచ‌న కొంద‌రు గులాబీ నేత‌ల నోటి నుంచి వ‌చ్చినా.. ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో తాజా మాజీ అధికార‌ప‌క్షం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌కీయాల్ని ప‌క్క‌న పెడితే.. ఇలాంటి వ్యాఖ్య‌ల‌కు ప్ర‌జ‌ల స్పంద‌న ఏమిట‌న్న‌ది కాల‌మే డిసైడ్ చేయాలి.